తెలంగాణ

telangana

ETV Bharat / state

మరోసారి ప్రభుత్వ భూముల వేలానికి సిద్ధమైన హెచ్ఎండీఏ - ప్రభుత్వ భూముల వేలం

HMDA is ready to Auction Govt Lands again: ప్రభుత్వ భూములు విక్రయించి నెలన్నర గడవక ముందే మరో వేలానికి హెచ్ఏండీఏ అధికారులు సమాయాత్తం అవుతున్నారు. ఈసారి సైతం గతంలో లాగానే మూడు జిల్లాల పరిధిలోని భూములను విక్రయించనున్నారు. ఇప్పటికే ఆయా జిల్లాలో వేలం ప్రక్రియపై అవగాహన సమావేశాలు నిర్వహించారు. ఈ సారి వేలంలో 121 గజాల అతి తక్కువ ప్లాటు సైతం ఉండటం గమనార్హం.

HMDA, Govt Lands in  Medchal Sangareddy Rangareddy
Govt Lands For Sale

By

Published : Feb 23, 2023, 9:37 PM IST

HMDA is ready to Auction Govt Lands again: హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాలు రంగారెడ్డి, మేడ్చల్- మల్కాజ్ గిరి, సంగారెడ్డి పరిధిలోని భూములను మరోసారి విక్రయించడానికి హెచ్ఏండీఏ సిద్ధం అవుతోంది. ఈ మూడు జిల్లాల పరిధిలోని 9 మండలాల్లో ఉన్న 39 స్థలాలను ఈ- వేలం ద్వారా అమ్మనున్నారు. ఇందులో రంగారెడ్డి జిల్లాలో 10, మేడ్చల్ జిల్లాలో 6, సంగారెడ్డి జిల్లాలో 23 స్థలాలున్నాయి. వీటి విక్రయానికి ఈ నెల 6న నోటిఫికేషన్ సైతం విడుదల చేశారు. మార్చి 1తేది ఈ- వేలం నిర్వహించనున్నారు.

గత నెల 18 న ఈ మూడు జిల్లాల పరిధిలోని భూములకు హెచ్ఎండీఏ అధికారులు వేలం నిర్వహించారు. దీనికి కోనుగోలుదారుల నుంచి మిశ్రమ స్పందనే వచ్చింది. దీంతో ధరలు, విస్తీర్ణం వంటి అంశాల్లో మార్పులు చేశారు. ఈ సారి వేలం నిర్వహిస్తున్న స్థలాల్లో.. గతంలో మిగిలిపోయినవే ఎక్కువగా ఉండటం గమనార్హం.

గత వేలంలో గరిష్ఠ ధర గజానికి రూ.1.50 లక్షలుగా నిర్ణయించిన అధికారులు.. దీనిని ప్రస్తుతం లక్ష రూపాయలకు తగ్గించారు. గచ్చిబౌలిలోని ఓ స్థలానికి ఈ ధరను నిర్ణయించారు. రూ.10 వేలు ఉన్న కనిష్ఠ ధరను మాత్రం రూ.20 వేలకు పెంచారు. మూడు జిల్లాల పరిధిలోని పలు స్థలాలకు ఈ ధరనే ఉండనుంది. గరిష్ఠంగా రంగారెడ్డి జిల్లా ఆదిభట్లలో 10164 గజాల స్థలం.. కనిష్ఠంగా సంగారెడ్డి జిల్లా వెలిమలలో 121 గజాల విస్తీర్ణంలో స్థలాలు వేలానికి అందుబాటులో పెట్టారు. ప్రస్తుతం వేలానికి పెట్టిన 39 స్థలాల్లో... 23 గత వేలంలో పెట్టినవే కావడం విశేషం.

వేలంలో పాల్గొనేందుకు, ఆన్ లైన్​లో దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల 27వ తేది వరకు అవకాశం కల్పించారు. మార్చి 1న ఆన్ లైన్లో వేలం జరగనుంది. ఉదయం 11గంటల నుంచి మధ్నాహ్నం 2గంటల వరకు రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలు, మధ్యాహ్నం 3గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు సంగారెడ్డి జిల్లాలోని భూముల వేలం నిర్వహించనున్నట్లు హెచ్ఎండీఏ ముఖ్య ప్రణాళిక అధికారి గంగాధర్ తెలిపారు.

గతంలో జరిగిన పొరపాట్లను అధికారులు ఈ సారి సరిదిద్దుకునే ప్రయత్నం చేశారు. స్థలాల విస్తీర్ణం, ధరల నిర్ణయంలో హెచ్చుతగ్గులను సవరించారు. కనీస ధరను సైతం రూ.లక్ష నుంచి రూ. 80 వేలకు తగ్గించారు. రంగారెడ్డి జిల్లా పేరంచెరువు పరిధిలోని స్థలాన్ని గత వేలంలో 4477 చదరపు గజాలుగా చూపించగా.. ఈసారి దీనిని 3637చదరపు గజాలుగానే నిర్ణయించారు. శేరిలింగంపల్లి మండలం దర్గా పరిధిలో గత వేలంలో పెట్టిన స్థలాన్ని ఈ సారి మూడు ముక్కలుగా విభజించారు. దీంతో పాటు ధరను లక్ష రూపాయల నుంచి రూ. 80 వేలకు తగ్గించారు. చందానగర్ పరిధిలోని సర్వే నంబర్ 174 పరిధిలోని స్థలాన్ని గతం వేలంలో 1694 చదరపు గజాలుగా చూపించారు. ప్రస్తుతం దీన్ని 1210 చదరపు గజాలకు తగ్గించారు.

సంగారెడ్డి జిల్లా వెలిమెల పరిధిలోని 287 సర్వే నంబర్ లోని స్థలానికి గత వేలంలో రూ. 30 వేలు ధర నిర్ణయించగా దాన్ని ప్రస్తుతం రూ. 20 వేలకు తగ్గించారు. ఇదే గ్రామ పరిధిలోని 598 సర్వే నంబర్ లోని స్థలానికి గతంలో రూ.50 వేలు ఉండగా.. ప్రస్తుతం రూ. 35 వేలకు తగ్గించారు. అమీన్‌పూర్ పరిధిలోని 823సర్వే నంబర్ లోని స్థలానికి ఇంతకు ముందు వేలంలో రూ. 70 వేలు నిర్ణయించగా.. అది ప్రస్తుతం రూ.57 వేలకు తగ్గింది. సుల్తాన్ పూర్ పరిధిలోని 439 సర్వే నంబర్ లో గత వేలంలో 8 స్థలాలు అమ్మకానికి పెట్టగా.. ప్రస్తుతం వాటిని 12 గా విభజించి.. ధరను రూ. 40 వేల నుంచి రూ. 30వేలకు తగ్గించారు. సంగారెడ్డి జిల్లా పరిధిలో 23 స్థలాలు వేలం పెడుతుండగా.. వీటిలో 18 గత వేలంలో ఎవరూ బిడ్ చేయనివే.

హెచ్ఏండీఏ అధికారులు నిర్వహిస్తున్న ప్రీ బిడ్ సమావేశాల్లో పాల్గొన్న వ్యాపారుల నుంచి మిశ్రమ స్పందన లభిస్తోంది. మౌలిక సదుపాయలు, స్థానిక పరిసరాలను పరిగణలోకి తీసుకోకుండా అధికారులు ధరలు నిర్ణయించారని.. అవి మార్కెట్ ధర కంటే చాలా ఎక్కువగా ఉన్నాయని వ్యాపారులు ఆరోపిస్తున్నారు. కొన్ని స్థలాల విషయంలో వాస్తవ స్థితికి అధికారులు చెబుతున్న దానికి తేడా ఉందని.. చెరువులు, కాలువల బఫర్ జోన్ పరిధిలోని స్థలాలను సైతం అమ్మకానికి పెట్టారని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ధరల విషయంలో పునరాలోచన చేయకపోతే.. గతం పరిస్థితే పునరావృతం అవుతుందని వ్యాపారులు అభిప్రాయపడుతున్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details