HMDA on ponds Full tank level : హైదరాబాద్ మహానగర పరిధిలోని చెరువుల పూర్తి నిల్వ సామర్థ్యం (ఫుల్ ట్యాంకు లెవల్-ఎఫ్‌టీఎల్) నిర్ధారణపై తీవ్ర నిర్లక్ష్యం నెలకొంది. హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ(హెచ్‌ఎండీఏ) ఎన్నిసార్లు తాఖీదులు పంపుతున్నా జిల్లా అధికారుల నుంచి ఉలుకూపలుకూ లేదు. ఈ నేపథ్యంలో తటాకాలు ఆక్రమణలకు గురై ఆనవాళ్లు కోల్పోతున్నాయి.
Ponds in Hyderabad : ఏడు జిల్లాల పరిధిలో దాదాపు 3,532 చెరువులను గుర్తించి సర్వే చేయగా...కేవలం 230 చెరువులకు మాత్రమే జిల్లా యంత్రాంగం ఎఫ్‌టీఎల్ నిర్ధారించింది. మరో 2,400 చెరువులకు ప్రాథమిక నోటిఫికేషన్ మాత్రమే జారీ చేశారు. మిగిలిన వాటికి అదీ లేదు. ఏళ్లు గడుస్తున్నా సరే...ఏదో ఒకటి చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తుండటంపై తాజాగా హెచ్‌ఎండీఏ కమిషనర్ అర్వింద్‌కుమార్ అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. వెంటనే ఎఫ్‌టీఎల్ లెక్క తేల్చాలని ఆదేశించారు. లేదంటే శాఖాపరమైన చర్యలకు కూడా వెనుకాడకూడదని నిర్ణయించినట్లు సమాచారం.
Full Tank Level of Hyderabad Ponds :నగరంలో భూమి విలువ పెరిగాక...చెరువులను చెరబడుతున్నారు. ఎఫ్‌టీఎల్ పరిధి దాటి ఆక్రమిస్తున్నారు. రాత్రికి రాత్రి మట్టి కప్పి చదును చేస్తున్నారు. తెల్లవారే సరికి అక్కడ నిర్మాణాలు కన్పిస్తున్నాయి. నగరం నడి బొడ్డున ఉన్న అంబీర్‌చెరువు నుంచి హెచ్‌ఎండీఏ శివార్లలోనూ శంషాబాద్, మేడ్చల్, శామీర్‌పేట తదితర ప్రాంతాల్లోని తటాకాల పరిస్థితీ ఇదే. హెచ్‌ఎండీఏ పరిధిలోని మొత్తం ఏడు జిల్లాల పరిధిలో 3,532 చెరువులున్నట్లు రెవెన్యూ రికార్డులు చెబుతున్నాయి. ఇందులో చాలా తటాకాలు రూపం కోల్పోయాయి. ముఖ్యంగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాల్లో ఆక్రమణలు ఎక్కువగా ఉన్నట్లు అధికారుల సర్వేలో తేలింది.
ఎక్కడ వేసిన గొంగళి అక్కడే...కోర్టుల్లో వ్యాజ్యాలు దాఖలైన తర్వాత చెరువుల రక్షణకు ప్రభుత్వంలో కొంత కదలిక వచ్చింది. ఎఫ్‌టీఎల్ నిగ్గు తేల్చేందుకు ఆరేళ్ల క్రితమే హెచ్‌ఎండీఏ పరిధిలోని లేక్ ప్రొటెక్షన్ కమిటీ రంగంలోకి దిగింది. ఏడు జిల్లాల పరిధిలోని ఎఫ్‌టీఎల్ నిర్ధారణకు నోటిఫికేషన్ జారీ చేసింది. ఆయా జిల్లాల్లోని అదనపు కలెక్టర్లను ప్రభుత్వం నోడల్ అధికారులుగా నియమించింది. వీరు రెవెన్యూ రికార్డులు, శాటిలైట్ మ్యాపులను పరిగణనలోకి తీసుకొని సర్వే చేసి వీరు ఎఫ్‌టీఎల్ నిర్ధారించాలి. అక్కడ ఎలాంటి నిర్మాణాలు ఉన్నాసరే...వాటిపై మార్కింగ్ వేసి కూల్చివేయాలి.
అధికారుల నిర్లక్ష్యంతో ఏ జిల్లాలో కూడా ఈ ప్రక్రియ సజావుగా సాగడం లేదు. ఉదాహరణకు రంగారెడ్డి జిల్లాలో అత్యధికంగా 1,078 చెరువులు ఉంటే...ఇప్పటివరకు కేవలం 79కు మాత్రమే ఎల్‌టీఎల్ కోసం ఫైనల్ నోటిఫికేషన్ ఇచ్చారు. మేడ్చల్‌లో 620 చెరువులు ఉంటే 97కు మించి ఎఫ్‌టీఎల్ నిర్ధారించలేదు. గ్రేటర్ పరిధిలోని అంబీర్‌చెరువు, పెద్దచెరువు, నల్లచెరువు, బాతులకుంట, ఫాక్స్‌సాగర్, అంబీర్‌చెరువు, మైసమ్మ చెరువు, సున్నం చెరువు, కాజాగూడ చెరువు, ముల్లకత్వ చెరువుల పరిధిలో భారీగా ఆక్రమణలు.. నిర్మాణాలు ఉన్నట్లు గతంలో గుర్తించారు. అయినా తూతూ మంత్రపు చర్యలతో సరిపెడుతున్నారు.