Developing horticultural forests in Hyderabad: గజిబిజి వాతావరణంలో బిజీబిజీగా గడిపే నగరవాసికి అప్పుడప్పుడు ప్రకృతిలోకి తొంగి చూడాలన్న కోరిక ఉంటుంది. ఇందుకు నగరం నుంచి ఎంతో దూరం వెళ్లాల్సిన అవసరం లేకుండా హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ(హెచ్‌ఎండీఏ)తోపాటు ఇతర ప్రభుత్వ విభాగాలు ఫారెస్టు బ్లాకులను అభివృద్ధి చేస్తున్నాయి. అవుటర్ లోపల, బయట సహజసిద్ధంగా ఉన్న అడవుల్లో పలు సౌకర్యాలతో పార్కులను తీర్చిదిద్దు తున్నాయి. ఇప్పటికే హెచ్‌ఎండీఏ ఆరు అటవీ ఉద్యానాలను అందుబాటులోకి తెచ్చింది. కుటుంబంతో కాసేపు గడిపి తిరిగి వచ్చేలా ఇక్కడ ఏర్పాట్లు చేశారు. కొన్ని ఉద్యానాల్లో రాత్రివేళ గడిపేందుకు కూడా సదుపాయాలు కల్పించనున్నారు. ఇవి త్వరలో అందుబాటులోకి రానున్నాయి. అన్ని పార్కుల్లో నిర్ణీత ప్రవేశ రుసుం వసూలు చేయనున్నారు.
గండిపేట.. పర్యాటకుల కోట:ఇటీవలి గండిపేట చెరువు పక్కనే రూ.38 కోట్లతో హెచ్‌ఎండీఏ లేక్‌వ్యూ పార్కు అందుబాటులోకి తెచ్చింది. మొత్తం 18 హెక్టార్లలో దీనిని తీర్చిదిద్దారు. వాక్‌వేలు, ఆర్ట్ పెవిలియన్లు, ఫ్లవర్ టెర్రాస్, పిక్‌నిక్ స్పేస్, ఓపెన్ ఎయిర్ థియేటర్, ఫుడ్‌కోర్టు తదితర సదుపాయాలు కల్పించారు. ప్రస్తుతం రోజుకు పదివేల మంది వరకు సందర్శిస్తున్నారు.
పల్లెగడ్డలో ప్రకృతి పరవళ్లు:మహేశ్వరంలోనే హర్షగూడ గ్రామానికి సమీపంలో 87 ఎకరాల్లో పల్లెగడ్డ పార్కును అభివృద్ధి చేశారు. తుక్కుగూడ (ఎగ్జిట్ నంబరు-14) నుంచి దీనికి చేరుకోవచ్చు. పచ్చని అందాలతో ఆకట్టుకుంటోంది. వారాంతాల్లో కాసేపు అక్కడే ప్రకృతిలో గడిపి తిరిగిరావచ్చు.
నాగారం అర్బన్ ఫారెస్టు పార్కు:మహేశ్వరం మండలంలోని నాగారం వద్ద 556.69 హెక్టార్లలో ఈ అర్బన్ ఫారెస్టు పార్కు తీర్చిదిద్దారు. అవుటర్ రింగ్ రోడ్డు నుంచి పెద్ద గోల్కొండ(ఎగ్జిట్ నంబరు-15) వద్ద కిందకు దిగితే ఈ పార్కులోకి వెళ్లవచ్చు. సఫారి ట్రాక్, వాచ్ టవర్, మరుగుదొడ్లు, కుర్చీలు తదితర సౌకర్యాలు ఉన్నాయి. ఎటు చూసినా పెద్దపెద్ద చెట్లు.. పక్షుల కిలకిలరావాలతో కనువిందు చేస్తోంది.