ప్రభుత్వం ఆగస్టు 27న అనధికార లేఅవుట్లు, అక్రమ నిర్మాణాల రిజిస్ట్రేషన్లు ఆపేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అనంతరం అప్పటికే ప్లాట్లు కొనుగోలు చేసినోళ్లు, లేఔట్లు వేసినోళ్లు ఆందోళనతో రోడ్డెక్కారు. భారీగా నష్టపోతామంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఆ మేరకు ప్రభుత్వం చివరి అవకాశంగా ఎల్‌ఆర్‌ఎస్ నోటిఫికేషన్ విడుదల చేసినట్లు హెచ్‌ఎండీఏ యంత్రాంగం చెబుతోంది.
హెచ్‌ఎండీఏకు కాసుల వర్షం..
ఎల్‌ఆర్‌ఎస్ నోటిఫికేషన్ 2015లో విడుదలైనప్పుడు 1.7లక్షల దరఖాస్తులొచ్చాయి. వాటి ద్వారా హెచ్‌ఎండీఏకు రూ.వెయ్యి కోట్ల ఆదాయం దక్కింది. లక్ష దరఖాస్తులు ఆమోదం పొందగా, వేర్వేరు కారణాలతో మిగిలినవి తిరస్కరణకు గురయ్యాయి. అప్పట్లో మరోమారు ఎల్‌ఆర్‌ఎస్ నోటిఫికేషన్ ఉండదని ప్రభుత్వం చెప్పినప్పటికీ.. ఎప్పటిలాగే అక్రమ లేఅవుట్లు పుట్టుకొచ్చాయి. అనధికార లేఅవుట్లు సుమారు 5వేల వరకు ఉండొచ్చని, వాటిలో లక్షకుపైగా ప్లాట్లు ఉండొచ్చని అంచనా. ప్రభుత్వ నిర్ణయంతో వారంతా ఇప్పుడు క్రమబద్ధీకరణకు దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు చెబుతున్నారు.
40వేల దరఖాస్తులు రావొచ్ఛు
ఎల్‌ఆర్‌ఎస్-2015 నోటిఫికేషన్ సమయంలో జీహెచ్‌ఎంసీ పరిధి నుంచి 80వేల దరఖాస్తులొచ్చాయి. వాటి ద్వారా రూ.500కోట్లు సమకూరాయి. 32వేల దరఖాస్తులు ఆమోదం పొందాయి. ఇప్పుడు కనీసం 40వేల దరఖాస్తులు రావొచ్చని అధికారులు భావిస్తున్నారు. ఈ దఫా ప్రణాళికాబద్ధంగా పరిశీలన చేపడతామని, జాప్యానికి తావులేకుండా త్వరగా ప్రక్రియ పూర్తిచేస్తామని ప్రణాళిక విభాగం చెబుతోంది.
అడ్డుకట్ట పడుతుంది..
అనుమతి లేని లేఅవుట్లు, అక్రమ నిర్మాణాల్లో ఇంటి స్థలం, ఇంటి రిజిస్ట్రేషన్లు జరుగుతుండటంతో శివారు ప్రాంతాలు అడ్డదిడ్డంగా విస్తరిస్తున్నాయి. ప్రభుత్వం ఏదో ఓ రోజు మరోమారు ఎల్‌ఆర్‌ఎస్ నోటిఫికేషన్ ఇస్తుందన్న ధైర్యంతో ఆయా ప్రాంతాల్లో జనం కొనుగోళ్లు చేస్తున్నారని అధికారులు చెబుతున్నారు. ఇప్పుడు అలాంటి అవకాశం లేకుండా ప్రభుత్వం ఎల్‌ఆర్‌ఎస్ నోటిఫికేషన్‌కు ముందు.. అనధికార లేఅవుట్ల రిజిస్ట్రేషన్లను ఆపేస్తూ నిర్ణయం తీసుకుందని గుర్తుచేస్తున్నారు. ఈ రెండు నిర్ణయాలతో గతంలో కొనుగోలు చేసిన వారికి ప్రయోజనం కలగడంతోపాటు, ఇకపై అక్రమ లేఅవుట్లు రాకుండా ఉంటాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ఎక్కువ దరఖాస్తులు రావచ్చని భావిస్తున్న సర్కిళ్లు
కుత్బుల్లాపూర్, కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి, అల్వాల్, ఎల్బీనగర్, హయత్‌నగర్, ఉప్పల్, కాప్రా, చాంద్రాయణగుట్ట, రాజేంద్రనగర్