దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరిని కల్చివేసింది దిశ హత్యాచార ఘటన. హైదరాబాద్ శివారులో నలుగురు దుర్మార్గుల చేతిలో పదిరోజుల క్రితం దారుణంగా హతమైన యువ వైద్యురాలు దిశ. ఆమె హత్యాచారానికి గురయ్యిందన్న సమాచారాన్ని నిర్ధరించుకున్న పోలీసులు.. సుప్రీంకోర్టు ఆదేశాలను పాటించారు. ఆమె పేరును పత్రికలు, ప్రసార మాధ్యమాలతోపాటు తమ శాఖలోని అధికారులు, సిబ్బంది కూడా ఉచ్చరించకూడదని నిర్ణయం తీసుకున్నారు.
నిర్భయ మాదిరి..
సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. దిశ ఘటన జరిగిన అనంతరం వివరాలు తెలిపేందుకు శంషాబాద్లో గత నెల 29న జరిగిన విలేకరుల సమావేశంలో యువవైద్యురాలి అసలు పేరు ప్రచురించవద్దని.. ఫొటోలు, వీడియోలు చూపించవద్దని అభ్యర్థించారు. ఆమెకు ఏదైనా పేరు పెట్టాలని అప్పుడు అనుకున్నారు. దిల్లీలో ఏడేళ్ల క్రితం అత్యాచారానికి గురైన బాధితురాలి పేరు 'నిర్భయ'గా వ్యవహరించాలంటూ అప్పటి ప్రభుత్వం నిర్ణయించింది. అయితే యువ వైద్యురాలి పేరును కూడా 'నిర్భయ' మాదిరిగానే వ్యవహరించాలని పలు పేర్లను పరిశీలించారు.