తెలంగాణ

telangana

ETV Bharat / state

'కర్మన్‌ఘాట్' ఆ పేరు ఎలా వచ్చిందంటే..! - తెలంగాణ వార్తలు

ఆంజనేయస్వామి భక్తులపాలిట పెన్నిధి. నిత్యం రామ ధ్యానంలో ఉండే ఆయనను స్మరిస్తే అన్ని రకాల భూత, ప్రేత, పిశాచ భయాలను పోగొడతాడు. ధ్యానముద్రలో స్వయంభువుగా వెలిసిన శ్రీ ఆంజనేయస్వామి అవతరించిన క్షేత్రమే హైదరాబాద్‌లోని కర్మన్‌ఘాట్‌ ఆలయం. వందల ఏళ్ల నుంచి భక్తులను దీవిస్తూ ధ్యానముద్రలో వున్న అంజనాసుతుని దర్శనాన్ని చేసుకుంటే అన్ని రకాలుగా మంచి ఫలితాలు లభిస్తాయి.

devotional news, hyderabad news, కర్మన్​ఘాట్​ ఆలయం, ఆంజనేయ స్వామి ఆలయం
Anjaneyaswamy temple, Karmanghat temple

By

Published : Mar 31, 2021, 8:15 AM IST

ధ్యానముద్రలో స్వయంభువుగా వెలిసిన శ్రీ ఆంజనేయస్వామి అవతరించిన క్షేత్రమే హైదరాబాద్‌లోని కర్మన్‌ఘాట్‌ ఆలయం. ముఖ్యంగా సంతానం లేనివారు స్వామిని దర్శించి నిండుమనసుతో ప్రార్థిస్తే సంతానం కలుగుతుందని పెద్దలు చెబుతారు.

రెండో ప్రతాపరుద్రునికి దర్శనం.. క్రీ.శ. 1148లో కాకతీయ సామ్రాజ్యాన్ని పరిపాలించే రెండో ప్రతాపరుద్రుడు వేటాడుతూ అలసి ఇక్కడ ఒక రాయిపై విశ్రమిస్తాడు. కాసేపటికి అతనికి పులి గాండ్రింపు శబ్దాలు వినిపించడంతో అప్రమత్తుడై విల్లంబులు ధరించి అక్కడకు వెళుతాడు. అక్కడ ఏమి కనిపించకపోవడంతో తిరిగి రాయి వద్దకు వస్తాడు. మళ్లీ పులి గాండ్రింపు వినరావడంతో తిరిగి గాలిస్తాడు. అప్పుడు కూడా ఎలాంటి జంతువు కనిపించలేదు. అదే సమయంలో రామశబ్దం రావడంతో చేతులు జోడించి ఆ అదృశ్యమూర్తిని ప్రార్థిస్తాడు. ధ్యానం చేస్తే దర్శనమిస్తానని ఆ మూర్తి స్వరం వినిపిస్తుంది. దీంతో రాజు అక్కడ ఏకాగ్రతతో ధ్యానం చేస్తాడు. కొద్దిసేపటికి ఇక లే నాయనా అంటూ స్వరం వినిపించడంతో రాజు కళ్లు తెరిచి ఆ శబ్దం వచ్చిన చోట వెతకగా ధ్యానాంజనేయస్వామి విగ్రహం లభ్యమైంది.

పరమానందభరితుడైన రాజు ఆ విగ్రహానికి పూజలు చేసి కోటకు తిరిగి వెళ్లిపోతాడు. ఆ రాత్రి కలలో స్వామివారు అతనికి ప్రత్యక్షమై తనకు ఆలయం నిర్మించమని ఆదేశిస్తారు. స్వామి అనుజ్ఞ ప్రకారం ఆలయాన్ని నిర్మించినట్టు చారిత్రక ఆధారాలు తెలుపుతున్నాయి. స్వామివారిని అనంతరం కాకతీయ రాజులందరూ ఇష్టదైవంగా పూజించడంతో క్షేత్ర మహిమ అన్ని ప్రాంతాలకు వ్యాపించడంతో భక్తులు వేల సంఖ్యలో స్వామి దర్శనానికి వచ్చేవారు.

స్వామివారే హెచ్చరించారు..

17వ శతాబ్దంలో గోల్కొండ సామ్రాజ్యాన్ని మొగల్‌ పాలకుడు ఔరంగజేబ్‌ స్వాధీనం చేసుకున్నాడు. అతని సైన్యంలోని కొందరు ధ్యానాంజనేయస్వామి ఆలయం వద్దకు చేరుకొని ఆలయాన్ని ధ్వంసం చేసేందుకు యత్నించారు. అయితే స్వామి దివ్యశక్తితో వారు విజయం సాధించలేకపోయారు. ఈ విషయాన్ని తెలుసుకున్న ఔరంగజేబ్‌ స్వయంగా దాడికి దిగాడు. ఈ క్రమంలో ఆలయం వద్దకు చేరుకోగా ఆలయం నుంచి పెద్ద స్వరంతో ‘మందిర్‌ తోడ్‌నా హైతో పహలె తుమ్‌ కరో మన్‌ఘట్‌’(ఆలయాన్ని ధ్వంసం చేయాలనుకుంటే మనసును గట్టిగా చేసుకో) అని పలికింది. దీంతో ఔరంగజేబ్‌ తనకు కనపడమని కోరగా తాటిచెట్టు కంటే ఎత్తైన రూపం కనిపించడంతో అతను భీతిల్లి వెనుదిరిగాడు. కరో మన్‌ఘట్‌ అన్న పేరే కర్మన్‌ఘాట్‌గా మారింది.

నిత్యపూజలు.. స్వామివారి ఆలయంలో నిత్యపూజలు జరుగుతుంటాయి. రోజూ వందలాది మంది భక్తులు స్వామి వారి దర్శనం కోసం వస్తుంటారు. ఈ ఆలయ ప్రాంగణంలో పలు ఉపాలయాలను నిర్మించారు. ప్రశాంతమైన వాతావరణంలో వుండే ఆలయంలో స్వామివారి మూలవిరాట్‌ విగ్రహాన్ని దర్శించుకుంటే మనసుకు ప్రశాంతత చేకూరుతుంది. కొత్తగా కొనుగోలు చేసిన మోటార్‌ వాహనాలకు ఇక్కడ పూజచేయించడం సంప్రదాయం. నిత్యం అనేక వాహనాలకు శకట పూజ జరుగుతుంది.

ఇలా చేరుకోవచ్చు

* హైదరాబాద్‌ నగరంలోని ఇన్నర్‌ రింగ్‌రోడ్డు సమీపంలో ఆలయం వుంది.
* దిల్‌సుఖ్‌నగర్‌, ఎల్బీనగర్‌ల నుంచి చేరుకోవచ్చు.
* మీర్‌పేట్‌, జిల్లెల్లగూడ, నాదర్‌గుల్‌, ఆర్‌.ఎన్‌.రెడ్డినగర్‌...తదితర శివారు ప్రాంతాలకు వెళ్లే సిటీ సర్వీసులు కర్మన్‌ఘాట్‌ మీదుగానే వెళుతాయి.

ఇదీ చూడండి:మువ్వన్నెలు విరిసిన వేళ.. శత వసంతాల హేల..!

ABOUT THE AUTHOR

...view details