NTR Aarogya Ratham in Hindupuram : ఆరోగ్యమే మహా భాగ్యం అన్నారు పెద్దలు. కానీ సరైన వైద్యం అందక ఎంతో మంది పేదలు అనారోగ్యంతో ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వారందరికీ మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యంగా హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ కృషి చేస్తున్నారు. ఎన్టీఆర్ ఆరోగ్య రథం పేరిట బస్సును ఏర్పాటు చేసి, ఓ వైద్య బృందాన్ని నియమించి.. పల్లె ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్నారు. జిల్లా ఆసుపత్రుల తరహాలో అత్యాధునిక వైద్య పరికరాలతో రోగ నిర్ధారణ చేస్తూ పల్లె వాసుల అనారోగ్య సమస్యలను దూరం చేస్తున్నారు.
శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గంలో వైద్యారోగ్యశాఖకు సమాంతరంగా ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సంచార వైద్య సేవలు అందిస్తున్నారు. ఎన్టీఆర్ ఆరోగ్య రథం పేరిట బస్సును, ఆత్యాధునిక పరికరాలను ఏర్పాటు చేశారు. హిందూపురం నియోజకవర్గంలోని హిందూపురం, చిలమత్తూరు, లేపాక్షి మండలాల్లో రోజూ ఓ గ్రామానికి వెళ్తున్న ఆరోగ్య రథం బస్సు గ్రామీణులకు ఆధునిక వైద్య సేవలు అందిస్తోంది. రోగ నిర్ధారణ పరీక్షలతో పాటు, ఖరీదైన మందులు ఉచితంగా ఇస్తుండటంతో ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోంది.
"మాకు దీని ద్వారా మందులు ఇస్తున్నారు. ఎమ్మెల్యే బస్సు పంపి మందులు ఇవ్వటం ఎంతో సౌకర్యంగా ఉంది. మాకు ఎంతో ఆనందంగా ఉంది." -సహాయం పొందిన గ్రామస్థురాలు
"నాకు మోకీలు నొప్పితో వచ్చాను. బీపీ, షుగర్ చెక్ చేసి మందులు ఇస్తున్నారు. నాకు ఇంజెక్షన్, మాత్రలు ఇచ్చారు. మాకు ఎంతో సౌకర్యవంతంగా ఉంది." -సహాయం పొందిన గ్రామస్థుడు