తెలంగాణ రాష్ట్రంలో వాణిజ్య పన్నుల శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి కాసుల వర్షం కురిపిస్తోంది. అత్యధిక ఆదాయాన్ని తెచ్చి పెడుతూ ఖజానాకు వెన్నుదన్నుగా నిలుస్తోంది. రాష్ట్రంలో వాణిజ్య పన్నుల రాబడులు(commercial tax in telangana) క్రమంగా పెరుగుతున్నాయి. గత ఆర్థిక ఏడాది మొదటి ఆరు నెలల్లో వచ్చిన రాబడుల మొత్తం రూ.17,888 కోట్లు కాగా... ఈ ఆర్థిక సంవత్సరం అదే సమయంలో రూ.29,885.87 కోట్లు వచ్చాయి. ఏకంగా 67 శాతం వృద్ధి నమోదు చేసింది. సెప్టెంబరులో వచ్చిన రాబడులను పద్దుల వారీగా గతేడాది ఇదే నెలలో వచ్చిన ఆదాయంతో పోల్చితే 33శాతం అధికంగా వచ్చినట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
వృద్ధి నమోదు
పెట్రోల్ అమ్మకాలపై వ్యాట్ ద్వారా గతేడాది సెప్టెంబరులో రూ.719.68 కోట్లు రాబడి రాగా... ఈ ఏడాది రూ.1,157.12 కోట్ల ఆదాయం వచ్చింది. దీనిపై ఏకంగా 61శాతం వృద్ధి కనబరిచింది. మద్యం అమ్మకాలపై వ్యాట్ ద్వారా గత ఏడాదిలో రూ.1,100 కోట్లు రాబడి రాగా... ఈసారి రూ.1,061.57 కోట్ల ఆదాయం(commercial tax in telangana) వచ్చింది. దీనిలో స్వల్పంగా 3శాతం తగ్గుదల నమోదైంది. జీఎస్టీ గతేడాది సెప్టెంబరులో రూ.2,071 కోట్ల రాబడి రాగా... ఈ ఏడాది రూ.2,526.36 కోట్ల ఆదాయం సమకూరింది. దీనిపై 22శాతం అధిక రాబడి వచ్చినట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.