రాష్ట్రంలో ఇంజినీరింగ్ ప్రవేశాల కోసం నిర్వహించే ఎంసెట్‌ను జులై 5 నుంచి 9 వరకు నిర్వహించనున్నట్లు ఉన్నత విద్యా మండలి ప్రకటించింది. ఈసెట్ జులై 1న, పీజీఈసెట్ జూన్ 20 నుంచి నిర్వహించనున్నట్లు వెల్లడించింది. ఐసెట్, ఎడ్‌సెట్, లాసెట్, పీఈసెట్ తేదీలను తర్వాత ప్రకటిస్తామని ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ పాపిరెడ్డి తెలిపారు. గతంలో నిర్వహించిన విశ్వ విద్యాలయాలకే మళ్లీ ప్రవేశ పరీక్షల నిర్వహణ బాధ్యతను అప్పగించారు.
కన్వీనర్లు వీరే
ఎంసెట్, ఈసెట్‌ను జేఎన్టీయూహెచ్, ఐసెట్, కాకతీయ యూనివర్సిటీ, పీజీ ఈసెట్, ఎడ్‌సెట్, లాసెట్ బాధ్యతలను ఉస్మానియా యూనివర్సిటీకి, పీఈసెట్ మహాత్మాగాంధీ యూనివర్సిటీకి బాధ్యతలు అప్పగించింది. పీజీఈసెట్, ఎడ్‌సెట్ మినహా మిగతా ఎంట్రన్సుల కన్వీనర్లను ఈ విద్యా సంవత్సరం యథాతథంగా కొనసాగించాలని నిర్ణయించింది. ఎంసెట్ కన్వీనర్‌గా జేఎన్టీయూహెచ్ రెక్టార్ గోవర్దన్, ఈసెట్‌కు జేఎన్టీయూహెచ్ ప్రొఫెసర్ వెంకట రమణారెడ్డి, ఐసెట్‌కు కేయూ ప్రొఫెసర్ కె.రాజి రెడ్డి, పీజీఈసెట్‌కు ఓయూ ప్రొఫెసర్ పి.లక్ష్మినారాయణ, ఎడ్‌సెట్‌కు ఓయూ ప్రొఫెసర్ ఎ.రామకృష్ణ, లాసెట్, పీజీఎల్ సెట్‌కు ఓయూ ప్రొఫెసర్ జీబీ రెడ్డి, పీఈసెట్‌కు ఓయూ ప్రొఫెసర్ వి.సత్యనారాయణను నియమించారు.
వెయిటేజీ యథాతథం
ఎంసెట్‌లో ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో 70 శాతం.. మొదటి సంవత్సరంలో పూర్తి సిలబస్ నుంచి ప్రశ్నలు ఇవ్వాలని ఉన్నత విద్యామండలి ఇప్పటికే నిర్ణయించింది. జేఈఈ తరహాలోనే ఈ ఏడాది ఎంసెట్‌లో ఛాయిస్ ఇవ్వనున్నారు. ఎన్ని ప్రశ్నలు అదనంగా ఇవ్వాలో నిపుణులతో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. ఎంసెట్ ర్యాంకుల ఖరారులో ఇంటర్ మార్కులకు 25 శాతం వెయిటేజీ యథాతథంగా కొనసాగుతుందని ఉన్నత విద్యామండలి తెలిపింది.
ఇదీ చదవండి:రైతుకు పెట్టుబడి ఇవ్వాలని ఎవరైనా ఆలోచించారా? : కేటీఆర్