రాష్ట్ర విభజనకు ముందు సబ్‌ఇంజినీర్లు పోస్టుల నియామకాలకు ట్రాన్స్‌కో ఇచ్చిన నోటిఫికేషన్లు కాలం చెల్లినవంటూ, ఈ పోస్టుల భర్తీ ప్రక్రియకు తిరిగి నోటిఫికేషన్ జారీ చేయడం ఏకపక్షమని హైకోర్టు స్పష్టం చేసింది. సబ్‌ఇంజినీర్ల నియామకాలకు నిమిత్తం 2011, 2012ల్లో ఇచ్చిన నోటిఫికేషన్లు కాలం చెల్లినవంటూ 2017 డిసెంబరులో జారీ చేసిన ట్రాన్స్‌కో ఆఫీస్ ఆర్డర్ (టూ), అదే ఏడాది డిసెంబరులో నియామకం కోసం జారీ చేసిన నోటిఫికేషన్ చట్ట విరుద్ధమని, రాజ్యాంగంలోని అధికరణ 14కు అది విరుద్ధమని ప్రకటించింది.
వీటి జారీకి సరైన కారణాలు లేవని పేర్కొంటూ వాటిని రద్దుచేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 2011, 2012లలో ఉమ్మడి రాష్ట్ర ట్రాన్స్‌కో జారీ చేసిన నోటిఫికేషన్ల ప్రకారమే సబ్ ఇంజినీర్ల పోస్టులకు పిటిషనర్లతోపాటు అర్హులైనవారికి నియామక పత్రాలు జారీ చేయాలని తెలంగాణ ట్రాన్స్‌కోను ఆదేశించింది. అయితే ఈ నియామకాలు కేవలం సబ్‌ఇంజినీర్లకు (ఎలక్ట్రికల్) మాత్రమే వర్తిస్తాయని, జూనియర్ ఇంజినీర్లు, జూనియర్ లైన్‌మెన్ పోస్టులకు వర్తించవని స్పష్టం చేసింది.