పాఠశాలల్లో ఆన్ లైన్ తరగతులు నిషేధించాలని కోరుతూ... హైదరాబాద్ స్కూల్ పేరెంట్స్ అసోసియేషన్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టులో మరోసారి విచారణ జరిగింది. ఆన్ లైన్, దూర విద్యా విధానంలో పాఠశాల తరగతులు ప్రారంభించాలని కేబినెట్ సమావేశంలో నిర్ణయించినట్లు హైకోర్టుకు సర్కారు వివరించింది. పాఠశాల విద్యా సంవత్సరం ప్రారంభంపై ఒకటి, రెండు రోజుల్లో నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు వివరించింది.
ప్రభుత్వం నిర్ణయం..
ఆన్ లైన్ తరగతులపై జాతీయ విద్య పరిశోధన, శిక్షణ సంస్థ మార్గదర్శకాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవచ్చునని కేంద్ర ప్రభుత్వం తెలిపిందని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది సంజీవ్ కుమార్ తెలిపారు. ఓ వైపు విద్యా సంవత్సరం ప్రారంభం కాలేదంటున్నారని.. మరోవైపు ఆన్ లైన్ తరగతులు జరుగుతున్నాయని.. ప్రభుత్వ తీరు ఆశ్చర్యకరంగా ఉందని మరోసారి హైకోర్టు వ్యాఖ్యానించింది.
హైకోర్టు ఆశ్చర్యం...
ప్రభుత్వం ఇప్పటికీ స్పష్టమైన వైఖరి ప్రకటించకుండా.. అయితే కావచ్చు, లేకపోతే లేకపోవచ్చు అన్నట్టుగా వ్యవహరిస్తోందని పేర్కొంది. రాష్ట్రంలో పాఠశాల విద్యా సంవత్సరం ఇంకా ప్రారంభం కాలేదని ప్రభుత్వం హైకోర్టుకు స్పష్టం చేసింది.
ఆన్ లైన్ బోధన ఎలా ఉండాలనే అంశంపై త్వరలో ప్రైవేటు పాఠశాలలకు కూడా విధి విధానాలను ప్రకటించనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. వ్యాయామ విద్య కూడా ఆన్ లైన్ లో బోధిస్తున్నట్టు ఇండిపెండెంట్ స్కూల్ మేనేజ్ మెంట్స్ అసోసియేషన్ పేర్కొనడంపై హైకోర్టు ఆశ్ఛర్యం వ్యక్తం చేసింది.
మార్చినెలలోనే...
మార్చి నెలలోనే విద్యాసంవత్సరం ప్రారంభించినట్లు సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ పాఠశాలలు చెబుతున్నాయన్న హైకోర్టు.. ప్రభుత్వ నిర్ణయం విద్యా శాఖ పరిధిలోని విద్యా సంస్థలకే వర్తిస్తుందా అని ప్రశ్నించింది. ఆన్ లైన్ తరగతులపై వైఖరిని వెల్లడించేందుకు మరో రెండు వారాల గడువు కావాలని సీబీఎస్ఈ కోరింది. ఈ అంశంలో తమ వాదనలు కూడా వినాలని చంద్రశేఖర్ అనే పేరెంట్ అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది. పేరెంట్స్ ఒక్కొక్కరిని అనుమతించలేమన్న హైకోర్టు.. విద్యార్థులు, తల్లిదండ్రుల పక్షాన ఉందని పిటిషనర్, ప్రభుత్వంతో పాటు హైకోర్టు కూడా ఉందని వ్యాఖ్యానించింది.
ఈనెల 27కి వాయిదా...
ఫీజులు వసూలు చేయవద్దని పేర్కొంటూ ప్రభుత్వం జారీ చేసిన జీవోను ప్రైవేట్ పాఠశాలలు ఉల్లంఘిస్తున్నాయని పిటిషనర్ తరఫు న్యాయవాది పేర్కొన్నారు. అందరి వాదనలు వినక ముందే ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేమన్న హైకోర్టు.. అవసరమైతే ఫీజును వెనక్కి ఇవ్వాలని విచారణ పూర్తయ్యాక ఆదేశిస్తామని హైకోర్టు తెలిపింది. పిటిషన్ పై విచారణ ఈనెల 27కి వాయిదా వేసింది.