గురుకులాల్లో వ్యాయామ ఉపాధ్యాయ ఉద్యోగాలను జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి.. ఎన్సీటీఈ నిబంధనల ప్రకారమే చేపట్టాలని హైకోర్టు స్పష్టం చేసింది. నోటిఫికేషన్లో పేర్కొన్న పీఈటీ పోస్టులను 1 నుంచి 8 తరగతులు... 8 నుంచి 10 వరకు తరగతులకు విభజించాలని ఉన్నత న్యాయస్థానం తెలిపింది.
అర్హత సాధించిన అభ్యర్థులతో భర్తీ చేయండి: హైకోర్టు - tspsc latest updates
గురుకుల పీఈటీ నియమాకాలను ఎన్సీటీఈ నిబంధనల ప్రకారమే చేపట్టాలని హైకోర్టు స్పష్టం చేసింది. నోటిఫికేషన్లో పేర్కొన్న పీఈటీ పోస్టులను రెండు రకాలుగా విభజించి.. అర్హత సాధించిన అభ్యర్థులతో భర్తీ చేయాలని స్పష్టం చేసింది.
విభజించిన పోస్టులను ఇప్పటికే అర్హత సాధించిన అభ్యర్థులతో భర్తీ చేయాలని స్పష్టం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా గురుకులాల్లో 616 పీఈటీ ఉద్యోగాల భర్తీకి 2017లో టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే జాతీయ ఉపాధ్యాయ మండలి నిబంధనల ప్రకారం 1 నుంచి 8 వరకు డీపెడ్.. 8 నుంచి 10 వరకు బీపెడ్ అభ్యర్థులు అర్హులని... కానీ టీఎస్పీఎస్సీ అన్నింటినీ కలిపి నోటిఫికేషన్ జారీ చేసిందంటూ పలువురు డీపెడ్ అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. విభజించి వేర్వేరుగా భర్తీ చేయాలని గతంలో సింగిల్ జడ్జి ఆదేశించారు. సింగిల్ జడ్జి ఆదేశాలను సవాల్ చేస్తూ గురుకుల సొసైటీలు, బీపెడ్ అభ్యర్థులు ధర్మాసనాన్ని ఆశ్రయించాయి. విచారణ జరిపిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లి, జస్టిస్ విజయసేన్ రెడ్డి ధర్మాసనం.. ఎన్ సీటీఈ నిబంధనల ప్రకారమే నియామక ప్రక్రియ నిర్వహించాలని స్పష్టం చేసింది.