ప్రభుత్వ ఉత్తర్వులన్నీ ప్రజలకు అందుబాటులో ఉండాలని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. జీవో జారీ చేసిన 24 గంటల్లో వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. యాదాద్రి జిల్లా వాసాలమర్రిలో దళితబంధు పథకం అమలును సవాల్ చేస్తూ వాచ్ వాయిస్ ఆఫ్ ది పీపుల్ అనే స్వచ్ఛంద సంస్థ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లి, జస్టిస్ బి.విజయసేన్ రెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టింది. అర్హుల ఎంపికకు నిబంధనలు, విధివిధానాలను ఖరారు చేయకముందే వాసాలమర్రిలో దళితబంధు పథకం కోసం రూ. 7 కోట్లు విడుదల చేసిందని పిటిషనర్ తరఫు న్యాయవాది శశికిరణ్ వాదించారు.
జీవోలన్నీ 24 గంటల్లో వెబ్సైట్లో పెట్టాలి: హైకోర్టు
12:59 August 18
జీవోలన్నీ 24 గంటల్లో వెబ్సైట్లో పెట్టాలి: హైకోర్టు
రాష్ట్రంలోని దళితులందరూ ఈ పథకానికి అర్హులేనని అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ తెలిపారు. దీనికి సంబంధించి గత నెల 18న జీవో 6 జారీ చేసినట్లు ఏజీ తెలిపారు. జీవో వివరాలను పిల్‌తో ఎందుకు సమర్పించలేదని ధర్మాసనం పిటిషనర్‌ను ప్రశ్నించింది. జీవో వివరాలు ప్రభుత్వ వెబ్సైట్లో అందుబాటులో లేవని.. అందుకే తమకు తెలియలేదని న్యాయవాది శశికిరణ్ పేర్కొన్నారు.
ఇబ్బందేంటి.?
జీవోలను పారదర్శకంగా ప్రజలకు అందుబాటులో ఉంచేందుకు ఇబ్బందేమిటని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. హైకోర్టు న్యాయమూర్తులు ఉత్తర్వులను 24 గంటల్లో వెబ్సైట్లో అప్లోడ్ చేస్తున్నారని.. ప్రభుత్వం ఎందుకు చేయలేదని పేర్కొంది. వాసాలమర్రిలో దళితబంధుపై ఏజీ బీఎస్ ప్రసాద్ వివరణను నమోదు చేసిన హైకోర్టు.. పిల్‌పై విచారణను ముగించింది. అయితే ఇక నుంచి ప్రభుత్వం విడుదల చేసే జీవోలన్నీ 24 గంటల్లో వెబ్సైట్లో అందుబాటులో ఉంచాలని స్పష్టం చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ఇదీ చదవండి:'గాంధీ'లో డీఎంఈ రమేశ్‌రెడ్డి విచారణ.. ఇప్పటికే అంతర్గత కమిటీ నివేదిక!