HighCourt Hearing on Teachers Transfers : బదిలీల్లో ఏ ప్రాతిపదికన ఉపాధ్యాయులను వేర్వేరుగా చూస్తున్నారని.. ప్రభుత్వాన్ని హైకోర్టు (HighCourt ) ప్రశ్నించింది. టీచర్‌ను పెళ్లి చేసుకుంటేనే ఉపాధ్యాయులను బదిలీ చేస్తారా అని వ్యాఖ్యానించింది. భార్యeభర్తలు ఒకేచోట ఉండాలనేది ఉద్దేశంతోనే ప్రత్యేక పాయింట్లు కేటాయించినట్లు ఉన్నత న్యాయస్థానానికి.. రాష్ట్ర సర్కార్ నివేదించింది. బదిలీలకు సంబంధించిన నిబంధనలను సవరించి ఈనెల 4న అసెంబ్లీ, 5న శాసనమండలి ముందుంచినట్లు తెలిపింది.
బదిలీల్లో ఉపాధ్యాయ దంపతులకు (Teachers Transfers) ప్రత్యేక పాయింట్లు కేటాయింపు వివాదానికి సంబంధించిన పిటిషన్లపై.. సీజే జస్టిస్ అలోక్ ఆరాధే, జస్టిస్ టి.వినోద్ కుమార్ ధర్మాసనం విచారణ జరిపింది. బదిలీల నిబంధనల్లో ఇటీవల మార్పులు చేసి చట్టసభల ముందుంచినట్లు.. అదనపు అడ్వకేట్ జనరల్ జె.రామచంద్రరావు మెమో సమర్పించారు. మెమో, కౌంటరు ఇవాళ ఇచ్చినందున వాదనలకు సమయం ఇవ్వాలని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు కోరారు.
ఏదో ఓ కారణంతో పిటిషనర్లు కాలయాపన చేస్తున్నారని.. ఫిబ్రవరి 14 నుంచి స్టే ఉన్నందున బదిలీల ప్రక్రియ నిలిచి పోయినందున త్వరగా విచారణ జరపాలని అదనపు ఏజీ. న్యాయస్థానాన్ని కోరారు. విద్యా సంవత్సరం సగానికి వచ్చిందని.. ఎన్నికల కోడ్ సమీపిస్తోందని వివరించారు. ఈ క్రమంలోనే ఇరువైపులా వాదనలు విన్న హైకోర్టు టీచర్ల బదిలీలపై.. ఈనెల 23న తుది వాదనలు వింటామని వెల్లడించింది.
Highcourt on teachers transfers : ఉపాధ్యాయుల బదిలీలపై సోమవారం విచారణ
ఇటీవలే తెలంగాణ వ్యాప్తంగా ప్రధానోపాధ్యాయులు, స్కూల్ అసిస్టెంట్లు, ఎస్జీటీలు పదోన్నతులు, బదిలీలపై విద్యాశాఖ జనవరిలో జీవోను జారీ చేసింది. దీనికి తగినవిధంగా జనవరి 27 నుంచి మార్చి 19 వరకు ప్రక్రియ చేపట్టేలా షెడ్యూల్ను రూపొందించారు. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 73,803 మంది టీచర్లు దీనికి దరఖాస్తు చేసుకున్నారు. ఇదిలా ఉండగా ఈ బదిలీలు చట్టవిరుద్ధంగా ఉన్నాయని పేర్కొంటూ.. నాన్ స్పౌజ్ టీచర్ల యూనియన్ ధర్మాసనాన్ని ఆశ్రయించారు.