న్యాయవాది తిరుమలరావు కరోనా పరీక్షలపై రాసిన లేఖను హైకోర్టు ప్రజా ప్రయోజన వ్యాజ్యంగా స్వీకరించింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ చేపట్టిన న్యాయస్థానం.. కరోనా పరీక్షలను ప్రైవేట్ లేబొరేటరీల్లో ఉచితంగా నిర్వహించే అవకాశాలను వివరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
పరీక్షకు రూ.4 వేల 500
వైరస్ నిర్ధరణ పరీక్షలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కొన్ని ప్రైవేట్ లేబొరేటరీలకు అనుమతినిచ్చిందని.. వాటిలో రూ.4 వేల 500 తీసుకుంటున్నారని పిటిషనర్ పేర్కొన్నారు. కరోనా ప్రభావంతో ఇప్పటికే వివిధ వర్గాలు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాయని.. పరీక్షల కోసం వేల రూపాయలు వసూలు చేయడం తగదన్నారు. ఐసీఎంఆర్ 1200 రూపాయలకే పరీక్షలు జరుపుతోందని తెలిపారు.