High Tension at Inter Board office :ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్ష ఫలితాలపై ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. సాంకేతిక కారణాల వల్లే విద్యార్థులకు తక్కువ మార్కులు వచ్చాయని... ఉచితంగా రీవాల్యూయేషన్ చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థులకు న్యాయం చేయాలని కోరుతూ నినాదాలు చేశారు. ఈ నేపథ్యంలో ఇంటర్ బోర్డు కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇంటర్ బోర్డు కార్యదర్శిని, విద్యాశాఖ మంత్రిని తొలగించాలని ఏబీవీపీ నాయకులు డిమాండ్ చేశారు. ఆందోళనకారులను అదుపుచేసేందుకు పోలీసులు ప్రయత్నించగా... పోలీసులు, విద్యార్థులకు మధ్య తోపులాట జరిగింది. ఆందోళన చేస్తున్న విద్యార్థులను అరెస్టు చేసి స్థానిక పోలీసు స్టేషన్‌కు తరలించారు.
High Tension at Inter Board office : ఇంటర్ బోర్డు కార్యాలయం వద్ద ఉద్రిక్తత - తెలంగాణ వార్తలు
12:39 December 21
విద్యార్థులందరినీ పాస్ చేయాలని డిమాండ్
ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఫలితాల్లో విద్యార్థులు పెద్ద సంఖ్యలో ఫెయిల్ కావడానికి, పలువురు ఆత్మహత్యకు పాల్పడటానికి రాష్ట్ర ప్రభుత్వమే కారణమని విద్యార్థి సంఘాలు సోమవారం ఆందోళన నిర్వహించాయి. ప్రభుత్వ నిర్లక్ష్యం, ఇంటర్మీడియట్ బోర్డు అధికారుల వైఫల్యం కారణంగా ఫలితాల్లో గందరగోళం తలెత్తిందని విద్యార్థి నాయకులు విమర్శించారు. హైదరాబాద్ కోంపల్లి జాతీయ రహదారిపై ఏబీవీపీ విద్యార్థి నాయకులు ఆందోళన చేపట్టారు.
విద్యార్థి సంఘాల ఆందోళనలు
ఇంటర్ ఫస్ట్ఇయర్ రిజల్ట్స్ తీరును నిరసిస్తూ.... విద్యార్థి సంఘాలు వరుస ఆందోళనలు చేపడుతున్నాయి. పీడీఎస్‌యూ, ఎస్‌ఎఫ్‌ఐ, ఎన్‌ఎస్‌యూఐ విద్యార్థి సంఘాల పిలుపు మేరకు ఇటీవల పెద్ద ఎత్తున విద్యార్థులు, విద్యార్థి నేతలు ఇంటర్ బోర్డు కార్యాలయం వద్దకు చేరుకున్నారు. బోర్డు తీరును నిరసిస్తూ.... పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ.... కార్యాలయం ముందు బైఠాయించారు. అప్పటికే ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున మొహరించిన పోలీసులు.... విద్యార్థులను ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. ఇంటర్ బోర్డు కార్యాలయం ఎదుట ఆందోళన చేస్తున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో ఆందోళనకారులకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగిది.
ఇంటర్ బోర్డు నిర్లక్ష్యమేనా?
కరోనా సమయంలో కళాశాలల్లో తరగతులు నిర్వహించలేదని పీడీఎస్‌యూ రాష్ట్ర కార్యదర్శి రాము ఇటీవల విమర్శించారు. అయినా ఇంటర్మీడియట్ అధికారులు పరీక్షలు నిర్వహించి... విద్యార్థులను మానసికంగా గందరగోళానికి గురి చేశారని అన్నారు. కేవలం కార్పొరేట్ కళాశాలల కోసమే పరీక్షలు నిర్వహించి... సగానికి పైగా విద్యార్థులను ఫెయిల్ చేశారని విద్యార్థి సంఘాలు ఆరోపించాయి. విద్యార్థి సంఘాల నాయకులను, కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకొని గోషామహల్ మైదానానికి తరలించారు.
ఇదీ చదవండి: TS Inter results: ఇంటర్ మొదటి సంవత్సరం ఫలితాలపై బోర్డు వివరణ ఇలా..!