High Security at Revanth Reddy House : రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టనుండటంతో ఆయన నివాసం వద్ద పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. మఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం తర్వాత, ప్రస్తుతం ఉన్న జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 44లో నివాసంలోనే ఉండాలని యోచిస్తున్నట్లు తెలిసింది. అక్కడే కొద్దిరోజులు ప్రజాదర్బార్ నిర్వహించేందుకు సన్నాహాలు చేయాలని సూత్రప్రాయ ఆదేశాలు రావడంతో అధికార యంత్రాంగం బందోబస్తు సహా ఇతర ఏర్పాట్లు చేస్తోంది. ముఖ్యమంత్రి నివాసానికి తరచూ ప్రముఖులు, అధికారులు, ఇతర ప్రజాప్రతినిధుల రాకపోకలుంటాయి.
Congress New Government in Telangana 2023 :భారీగా తరలివచ్చే వాహనాలకు పార్కింగ్ ఉండాలని అధికారులు భావిస్తున్నారు. సీఎంకి పదుల సంఖ్యలో వాహనాలతో కాన్వాయ్ ఉన్నందున అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొని అవాంఛనీయ ఘటనలకు ఆస్కారం లేకుండా అసాధారణ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. అక్కడకి పెద్దసంఖ్యలో తరలివచ్చే కార్యకర్తలు, అభిమానులను అదుపు చేసేందుకు సివిల్ పోలీసులు, ఆ తర్వాత దశలో ఆర్ముడ్ రిజర్వ్‌కి చెందిన సాయుధ బలగాలు బందోబస్తులో పాల్గొంటున్నారు. ప్రస్తుతం జూబ్లీహిల్స్ పోలీసుల ఆధ్వర్యంలో రెండు ప్లటూన్ల బలగాలు విధుల్లో ఉన్నాయి. నేటి నుంచి సాయుధ సిబ్బంది, స్థానిక పోలీసులు అంచెలంచెలుగా విధుల్లో ఉండేలా అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు.
ఉత్కంఠ వీడింది, ఊహించిందే జరిగింది - రేవంత్ రెడ్డికే ముఖ్యమంత్రి పగ్గాలు
Tight Security At Revanth Reddy House : రేవంత్ నివాసం, తన పార్లమెంట్ కార్యాలయం దగ్గర బారికేడింగ్ ట్రాఫిక్‌కు ఇబ్బంది లేకుండా వచ్చిన వాహనాలు సజావుగా తిరిగి వెళ్లేందుకు ఏమార్గాలు ఎంపికచేయాలో అధికారులు పరిశీలిస్తున్నారు. పోలీసు ఉన్నతాధికారులు, అంతర్గత భద్రతా విభాగం, ట్రాఫిక్ విభాగం అధికారులు అక్కడ పరిస్థితులు, భద్రతాపరంగా ఉన్న లోపాలు, వాటిని చక్కదిద్దేందుకు తీసుకోవాల్సిన చర్యలు, రూట్‌మ్యాప్ అన్ని స్వయంగా పరిశీలించనున్నారు.