మారుతీ హోంలో బాలికపై అత్యాచారం జరిగినట్లు హైపవర్ కమిటీ ప్రాథమికంగా తేల్చింది. ఈ మేరకు బాలిక తోటి స్నేహితుల నుంచి కమిటీ సభ్యులు వివరాలు సేకరించారు. మారుతీ హోంను తరచూ సందర్శించే వెంకటేశ్వర్ రెడ్డి అనే వ్యక్తి తనపై అత్యాచారం చేసినట్లు బాలిక బంధువులకు తెలిపింది. దీంతో బాలిక బంధువులు జూలై 31వ తేదీన బోయిన్పల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బోయిన్పల్లి పోలీసులు ఘటన జరిగిన ప్రాంతం పటాన్చెరు పీఎస్ పరిధిలోకి రావడం వల్ల కేసును అక్కడికి బదిలీ చేశారు. పటాన్చెరు పోలీసులు దర్యాప్తు చేసి వెంకటేశ్వర్ రెడ్డితో పాటు మారుతీ హోమ్ నిర్వాహకులు విజయ, జయదీప్లను ఆగస్టు 7న అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. బాలిక అనారోగ్యంగా ఉండటం వల్ల ఆగస్టు 1వ తేదీన పోలీసులు భరోసా కేంద్రానికి తరలించారు. అక్కడి నుంచి నింబోలిఅడ్డాలోని బాలికా సంరక్షణ కేంద్రానికి తరలించారు.
చికిత్స పొందుతూ మృతి
ఆరోగ్యం విషమించి కనీసం నడవలేని స్థితికి బాలిక చేరుకోవడం వల్ల ఆగస్టు 7వ తేదీన నీలోఫర్ ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ బాలిక మృతి చెందింది. బాలిక మృతి రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశం కావడం వల్ల మహిళాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో హైపవర్ కమిటీని నియమించారు. హోమ్‌ను సందర్శిచండంతో పాటు బాలిక బంధువులు, తోటి స్నేహితులు, పోస్టుమార్టం రిపోర్టు ఆధారంగా కమిటీ సభ్యులు ప్రాథమికంగా నివేదిక రూపొందించారు. బాలికపై అత్యాచారం జరిగినట్లు హైపవర్ కమిటీ ప్రాథమికంగా తేల్చింది. ఈ మేరకు భరోసా కేంద్రం నుంచి తీసుకున్న సమాచారంతో పాటు పోస్టుమార్టం రిపోర్టును నివేదికకు జతపర్చారు.