Telangana Budget Session 2022- 23: రాష్ట్ర బడ్జెట్ సమావేశాల నిర్వహణ తేదీలను ఖరారు చేయడం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్.. ప్రగతిభవన్‌లోఉన్నతస్థాయి సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి సహా అందుబాటులో ఉన్న మంత్రులు, ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, సీఎంవో ఉన్నతాధికారులు పాల్గొన్నారు. బడ్జెట్ సమావేశాల నిర్వహణా తేదీలను సమావేశంలో ఖరారు చేస్తారు. శాసనసభ, మండలిని సమావేశ పర్చాల్సిన తేదీలపై నిర్ణయం తీసుకుంటారు. వచ్చే నెల రెండో వారంలో బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యే అవకాశం ఉండగా... ఇందుకు సంబంధించి ఆర్థికశాఖ కసరత్తు పూర్తిచేసింది.
కొత్త ఉద్యోగాలు.?
ఉద్యోగుల వేతనాలు, ఇతర నిర్వహణ వ్యయానికి సంబంధించిన పద్దు ప్రక్రియ పూర్తయింది. ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలు, ఇతరత్రాలకు సంబంధించిన ప్రగతిపద్దు కసరత్తు కొనసాగుతోంది. ఉద్యోగుల వేతన సవరణ, కొత్త ఉద్యోగాల నియామకాలకు అవసరమైన మొత్తాన్ని నిర్వహణపద్దులో సర్దుబాటు చేసినట్లు సమాచారం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఆదాయాన్ని బేరీజు వేసుకుంటూ... వచ్చే ఏడాది రెవెన్యూ రాబడులను అంచనా వేసుకొని బడ్జెట్ ప్రతిపాదనలు ఖరారు చేయనున్నారు. ఇవాళ జరిగే సీఎం సమీక్ష అనంతరం బడ్జెట్ పద్దులకు సంబంధించి ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది.