TS High Court stay on teachers transfer తెలంగాణలో ఉపాధ్యాయుల బదిలీలపై హైకోర్టు స్టే విధించింది. ఉపాధ్యాయుల బదిలీలపై మార్చి 14 వరకు స్టే విధిస్తూ.. హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. నాన్ స్పౌజ్ టీచర్ల అసోసియేషన్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. టీచర్ల బదిలీల నిబంధనలపై హైకోర్టును నాన్ స్పౌజ్ టీచర్లు ఆశ్రయించారు. టీచర్ల బదిలీల నిబంధనలు రాజ్యాంగ విరుద్ధమని పిటిషనర్ల వాదించారు. ఉద్యోగ దంపతులు, యూనియన్ నేతలకు అదనపు పాయింట్లపై అభ్యంతరం వ్యక్తం చేశారు. విచారణ జరిపిన హైకోర్టు... ప్రభుత్వం కౌంటరు దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది.
teachers transfer in Telangana ఇటీవల ఉపాధ్యాయుల బదిలీలపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. జీవో 317తో బదిలీ అయిన టీచర్లకు పూర్వ జిల్లా సర్వీసును కూడా పరిగణనలోకి తీసుకోవాలని నిర్ణయించినట్టు తెలిపారు. ఈనెల 12 నుంచి 14 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. అయితే తాజాగా ఉపాధ్యాయుల బదిలీలపై హైకోర్టు స్టే విధించింది.
తెలంగాణలో గత కొన్ని రోజులుగా ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియ జరుగుతోంది. ఎస్జీటీలు, స్కూల్ అసిస్టెంట్లు, లాంగ్వేజి పండిట్లను బదిలీ చేసే ప్రక్రియ కొనసాగుతోంది. అయితే, బదిలీలకు సంబంధించిన నిబంధనల్లో కనీసం ఒకేచోట రెండేళ్లు పనిచేసిన వారు మాత్రమే బదిలీకి దరఖాస్తు చేసుకునేందుకు అర్హులుగా ప్రభుత్వం నిర్ణయించింది. ఇటీవల ఉమ్మడి జిల్లాల నుంచి కొత్త జిల్లాలకు 317 జీవో ప్రకారం బదిలీ అయిన వారికి రెండేళ్ల సర్వీసు పూర్తి లేదు. దీంతో.. తాము ఉమ్మడి జిల్లా నుంచి కొత్త జిల్లాకు వచ్చామని, ఉమ్మడి జిల్లాలోని సర్వీసును కూడా పరిగణనలోకి తీసుకోవాలని వారు గత కొంతకాలంగా ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ప్రభుత్వం నుంచి స్పందన రాకపోవడంతో హైకోర్టును ఆశ్రయించారు.