Telangana High Court on G.O. 402: ఉపాధ్యాయుల అంతర్ జిల్లాల పరస్పర బదిలీలకు సంబంధించిన సవరణ జీవోపై హైకోర్టు స్టే ఇచ్చింది. జీవో 21ని సవరిస్తూ ఫిబ్రవరి 19న జారీ చేసిన జీవో 402 అమలును నిలిపివేస్తూ ఉన్నత న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. సవరణ జీవోను సవాల్ చేస్తూ దాఖలైన పలు పిటిషన్లపై జస్టిస్ విజయసేన్‌రెడ్డి సోమవారం విచారణ చేపట్టారు.
జీవో 21 ప్రకారం అంతర్ జిల్లాల పరస్పర బదిలీలు కోరుకున్నట్లయితే సర్వీసు మొదటి నుంచి ప్రారంభం అవుతుందన్నారు. కానీ జీవో 402 ప్రకారం పాత ఉమ్మడి జిల్లా పరిధిలో పరస్పర బదిలీ ఉన్నట్లయితే సర్వీసు లెక్కింపు ఉంటుందన్నారు. ఇప్పటికే కొత్త జిల్లాలకు కేటాయింపులు పూర్తయినందున.. ఏ బదిలీ జరిగినా అది అంతర్ జిల్లాగానే పరిగణనలోకి తీసుకోవాలని పిటిషనర్ల న్యాయవాదులు వాదించారు. వాదనలు విన్న హైకోర్టు పిటిషన్లపై విచారణను వాయిదా వేస్తూ.. సవరణ జీవోపై స్టే ఇచ్చింది.
గతంలోనే మధ్యంతర ఉత్తర్వులు..
ఉపాధ్యాయుల అంతర్ జిల్లాల పరస్పర బదిలీలకు చెందిన జీవో 21కు సవరణ తీసుకువస్తూ జారీ చేసిన జీవో 402 అమలుపై యథాతథస్థితిని కొనసాగించాలంటూ హైకోర్టు గతంలోనే మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఫిబ్రవరి 19న జారీ చేసిన జీవో 402ను సవాలు చేస్తూ కె.తిరుపతిరెడ్డితో పాటు మరో 9 మంది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. జస్టిస్ బి.విజయ్‌సేన్‌రెడ్డి ఈ మేరకు తీర్పు వెల్లడించారు.