ధరణి పోర్టల్‌లో ఆస్తుల నమోదు నిమిత్తం ఆధార్ వివరాలను ఆడగటాన్ని సవాలు చేస్తూ న్యాయవాదులు గోపాల్ శర్మ, కాశీభట్ల సాకేత్లు వేర్వేరుగా ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు వేశారు. వీటిపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ బి.విజయ్ సేన్ రెడ్డిలతో కూడిన ధర్మాసనం సోమవారం మరోసారి విచారణ చేపట్టింది. ఈ అంశాలు మంత్రి మండలి పరిశీలనలో ఉన్నాయని... తగిన సూచనల కోసం జనవరిలో గడువు తీసుకున్నారని తెలిపింది. అలాగే ప్రభుత్వ నిర్ణయమేంటో చెప్పాలని ధర్మాసనం ప్రశ్నించింది. దీనిపై అడ్వకేట్ జనరల్ బి.ఎస్.ప్రసాద్ స్పందిస్తూ... ఈ అంశానికి సంబంధించి ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రత్యేక సూచనలు అందలేదని చెప్పారు.
ఆధార్ వివరాలు సేకరించవచ్చు..
వ్యవసాయ భూముల వివరాలను ధరణిలో నమోదు చేయడానికి ఆధార్ వివరాలు సేకరించవచ్చని బి.ఎస్.ప్రసాద్ అన్నారు. వ్యవసాయ భూములకు రైతుబంధు పథకంతో పాటు విత్తనాలు, ఎరువులు తదితరాలు సబ్సిడీ కింద ప్రభుత్వం అందజేస్తోందన్నారు. సంక్షేమ పథకాల అమలు కోసం ఆధార్ చట్టంలోని సెక్షన్ 7 ప్రకారం ఆధార్ వివరాలను సేకరించవచ్చని తెలిపారు. ఇది చట్టవిరుద్ధం కాదని పేర్కొన్నారు. వ్యవసాయేతర భూములను కంప్యూటర్ ఎయిడెడ్ రిజిస్ట్రేషన్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ద్వారా రిజిస్ట్రేషన్లు చేస్తున్నామన్నారు. ఇందులో ఎలాంటి వివరాలను సమర్పించాలని ప్రభుత్వం కోరడం లేదని, గతంలోలాగే రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయని ప్రసాద్ పేర్కొన్నారు. ఇప్పటికే కౌంటర్లు దాఖలు చేశామని, తుది విచారణ చేపట్టి తేల్చాల్సి ఉందని తెలిపారు.