వక్ఫ్ ఆస్తుల పరిరక్షణలో విఫలమైన వక్ఫ్ బోర్డు సీఈఓ మహమ్మద్ ఖాసింపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. వక్ఫ్ బోర్డు సీఈఓ ఆక్రమణదారులతో చేతులు కలిపినట్లుగా ఉందని ఉన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. చట్టాలపై కనీస అవగాహన లేని ఖాసిం.. వక్ఫ్ బోర్డు సీఈఓ పదవిలో ఉండటం ఎందుకని సూటిగా ప్రశ్నించింది. ముస్లిం శ్మశాన వాటికలు, ఇతర వక్ఫ్ ఆస్తుల ఆక్రమణలకు సంబంధించిన మూడు ప్రజా ప్రయోజనాలపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, జస్టిస్ బి.విజయ్ సేన్ రెడ్డి ధర్మాసనం ఇవాళ మరోసారి విచారణ చేపట్టింది.
కేవలం ఐదు కేసులే...
గత ఆదేశాల మేరకు హైకోర్టుకు వివరణ ఇచ్చేందుకు వక్ఫ్ బోర్డు సీఈఓ మహ్మద్ ఖాసిం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యారు. ఇప్పటి వరకు 85 వక్ఫ్ ఆస్తులు కబ్జాకు గురైతే కేవలం ఐదు కేసులే ఎందుకు నమోదు చేశారని ధర్మాసనం ప్రశ్నించింది. వక్ఫ్ ఆస్తుల కబ్జాపై క్రిమినల్ కేసులు నమోదు చేసేందుకు పోలీసులు నిరాకరిస్తున్నారని.. సివిల్ వివాదమని అంటున్నారని ఖాసిం వివరించారు. పోలీస్ స్టేషన్లో నిరాకరిస్తే చేతులెత్తేస్తారా.. ఎస్పీని, ఇతర ఉన్నతాధికారులు, సివిల్ కోర్టు లేదా హైకోర్టును ఎందుకు ఆశ్రయించలేదని.. కనీసం న్యాయవాదిని సంప్రదించారా అని ప్రశ్నల వర్షం కురిపించింది.