'పబ్‌లు, మద్యం దుకాణాలే ముఖ్యమా? ప్రజల ప్రాణాలు కాదా' - corona news
11:32 April 19
సర్కారు తీరుపై హైకోర్టు అసహనం
కరోనా నియంత్రణలో ప్రభుత్వం తీరుపై హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై ఉన్నత న్యాయస్థానం విచారణ జరిపింది. జనసంచారం తగ్గించేందుకు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించింది. థియేటర్లు, పబ్‌లు, బార్ల వద్ద ఏం చర్యలు తీసుకున్నారని ప్రభుత్వాన్ని అడిగిన హైకోర్టు.. నివేదికలో కనీస వివరాలు ఇవ్వడం లేదని అసహనం వెలిబుచ్చింది.
పబ్‌లు, మద్యం దుకాణాలే ముఖ్యమా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. జన సంచారం నియంత్రణకు నిర్ణయం తీసుకుంటామన్న ప్రభుత్వ వివరణపై స్పందించిన ఉన్నత న్యాయస్థానం.. ప్రజల ప్రాణాలు పోతుంటే ఇంకెప్పుడు నిర్ణయాలు తీసుకుంటారని వ్యాఖ్యానించింది. ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుందా? ఆదేశాలు ఇవ్వమంటారా? అన్న హైకోర్టు.. ప్రభుత్వ నిర్ణయాలను మధ్యాహ్నంలోగా నివేదించాలని స్పష్టం చేసింది. భోజన విరామం తర్వాత తిరిగి విచారణ చేపడతామన్న హైకోర్టు.. అధికారులు హాజరుకావాలని ఆదేశించింది