ఆర్టీసీ విషయంలో పరిస్థితిని మరింత తీవ్రం చేసే ఎలాంటి నిర్ణయాలు తీసుకోరాదంటూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్టీసీ కార్మిక సమ్మె నేపథ్యంలో పరిస్థితి మరింత క్షీణించకుండా పర్మిట్ల జారీకి సంబంధించిన నిర్ణయాన్ని సోమవారం వరకు తీసుకోరాదంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రవాణా శాఖ ముఖ్యకార్యదర్శి, ఆర్టీసీ ఎండీలను ఆదేశించింది.
5,100 పర్మిట్లు జారీ చేయడాన్ని సవాలు చేస్తూ.. హైకోర్టులో తెలంగాణ డెమోక్రటిక్ ఫోరమ్ కన్వీనర్ ప్రొ.విశ్వేశ్వరరావు ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, జస్టిస్ అభిషేక్ రెడ్డిలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది.
అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ :5,100 పర్మిట్ల జారీకి సంబంధించి కౌంటరు దాఖలు చేశాం. సోమవారం విచారణ చేపట్టండి.
ధర్మాసనం :విచారణకు అనుమతిస్తాం.. కానీ మంత్రిమండలి తీర్మానంతో పరిస్థితి మరింత ఉద్రిక్తం కాకుండా ఉండేందుకు తదుపరి చర్యలు తీసుకోబోమని హామీ ఇవ్వాలి.
ఏజీ :కేంద్ర ప్రభుత్వం మోటారు వాహన చట్టానికి సవరణ తీసుకువచ్చింది, ఆ చట్టాన్ని అమలు చేస్తున్నాం
ధర్మాసనం :అంత తొందరెందుకు సోమవారం వరకు వేచి చూడండి.
ఏజీ : 5100 పర్మిట్లను ప్రైవెటీకరిస్తూ.. మంత్రిమండలి తీసుకున్న నిర్ణయం చట్టానికి వ్యతిరేకం కాదు.
ధర్మాసనం : పలు చట్టాలకు వ్యతిరేకంగా మంత్రిమండలి నిర్ణయం తీసుకుందని పిటిషనర్ ఆరోపించారు.
ఏజీ : మోటారు వాహనాల చట్టాన్ని పరిశీలించండి
ధర్మాసనం : దీనిపై సోమవారం విచారణ చేపడతాం
ఏజీ : మధ్యంతర ఉత్తర్వులను వ్యతిరేకిస్తున్నాం
ధర్మాసనం : కేబినెట్ నిర్ణయం ఎక్కడ?
పిటిషనర్ తరఫు న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ : నవంబర్ 2న మంత్రి మండలి నిర్ణయం తీసుకున్నట్లు పత్రికల్లో వచ్చింది. తీర్మానం ప్రతి వెబ్సైట్లో పెట్టలేదు. అందువల్ల అది మాకు అందుబాటులో లేదు.
ఏజీ : మంత్రి మండలి తీర్మానం ప్రతి ప్రత్యేకమైనది(ప్రివిలైజ్), అందువల్ల దాన్ని బహిర్గతం చేయలేం. మండలి తీర్మానాన్ని వెల్లడించాలంటూ ఏ నిబంధన కూడా చెప్పలేదు.
ధర్మాసనం : తీర్మానం చట్టబద్ధతను సవాలు చేస్తూ.. పిటిషన్ దాఖలైంది. ఈ ప్రతి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వద్ద ఉన్నప్పటికీ, అది ప్రత్యేకమైనదైనప్పటికీ కోర్టు పరిశీలనకు ఇవ్వకుండా ఉండటానికి వీల్లేదు. కోర్టు ముంది ఏదీ ప్రత్యేకం కాదు. దాన్ని పరిశీలించకుండా చట్టబద్ధమో కాదో తేల్చడం సాధ్యం కాదు.
ఏజీ :మంత్రి మండలి నిర్ణయాన్ని ఒక పౌరుడు కోర్టులో ప్రశ్నించడానికి వీల్లేదు. ఇదే విషయాన్ని సుప్రీం పేర్కొంది.
ధర్మాసనం :మా అవగాహన కోసం మంత్రి మండలి నిర్ణయాన్ని చూడాలనుకుంటున్నాం. ఒకవేళ ఈ నిర్ణయాన్ని సవాలు చేయవచ్చని భావించినప్పుడే దాని చట్టబద్ధతను తేలుస్తాం.
ఏజీ :మంత్రి మండలి నిర్ణయాన్ని వెబ్సైట్లో ఉంచరు. దాని ఆధారంగా జారీ చేసిన జీవోలనే అప్లోడ్ చేస్తారు.
ధర్మాసనం : మంత్రి మండలి తీసుకున్న నిర్ణయం రహస్యం కానప్పుడు ప్రజలకు అందుబాటులో ఎందుకు ఉంచరు? మంత్రి మండలి పనిచేసేదే ప్రజల కోసం, అది ప్రజల వాణి వినిపించడంలో భాగంగా వారికి ప్రాతినిధ్యం వహిస్తుంది. ఈ కేబినెట్.. ప్రజల నుంచి ఏం దాచాలని ప్రయత్నిస్తోంది? కోర్టు ముందు ఏవీ దాచడానికి వీల్లేదు. దేశభద్రతకు సంబంధించినవి కూడా కోర్టు ముందు దాచడానికి వీల్లేదు.
ధర్మాసనం : తీర్మాన ప్రతిని ఇవ్వలేమని ప్రభుత్వం చెప్పజాలదు. అలా అయితే అది వారికి వ్యతిరేకంగా ఉందని భావించాల్సి వస్తుంది. ఎవిడెన్స్ చట్టంలోని సెక్షన్ 114 ప్రకారం వ్యతిరేక సాక్ష్యంగా పరిగణించాల్సి ఉంటుంది.
ఏజీ : అయితే ఉత్తర్వులు జారీ చేయండి.
వాదనలు పూర్తయ్యాక... ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో పరిస్థితిని మరింత తీవ్రం చేసేలా నిర్ణయం తీసుకోరాదంటూ ధర్మాసనం విచారణను ఈ నెల 11వ తేదీకి వాయిదా వేసింది.