HC Comments on Advisors Appointment: ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ సలహాదారుల నియామకం విషయంలో హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. దేవాదాయశాఖతో పాటు వివిధ శాఖల్లో ప్రభుత్వ సలహాదారులను నియమించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై గురువారం హైకోర్టులో విచారణ జరిగింది. ఇలాగే వదిలేస్తే తహసీల్దార్లకు కూడా సలహాదారులను నియమిస్తారేమోనని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. ఐఏఎస్ అధికారులు ఉండగా వివిధ శాఖలకు సలహాదారులు ఎందుకని ధర్మాసనం ప్రశ్నించింది.
సలహాదారుల నియామకానికి సంబంధించి రాజ్యాంగబద్ధతను తేలుస్తామని హైకోర్టు స్పష్టం చేసింది. రాష్ట్రంలో ప్రభుత్వ సలహదారులకు సంబంధించిన పూర్తి వివరాలను కోర్టు ముందు ఉంచాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. గతంలో దేవాదాయశాఖ సలహాదారుగా శ్రీకాంత్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఇచ్చిన జీవోపై న్యాయస్థానం స్టే విధించింది. స్టే ఉత్తర్వుల్లో సవరణ చేసి ఆయన సలహదారు పదవిలో కొనసాగేందుకు అనుమతిచ్చింది. సలహదారుల నియామకంపై తదుపరి విచారణను హైకోర్టు వాయిదా వేసింది.