High Court Response Chiranjeevi Custodian Death: హైదరాబాద్‌లోని తుకారాంగేట్ పోలీస్ విచారణలో చిరంజీవి అనే వ్యక్తి మృతిపై తెలంగాణ హైకోర్టు స్పందించింది. లాకప్‌లో అనుమానాస్పద కస్టోడియల్ మృతిని హైకోర్టు సుమోటోగా స్వీకరించింది. పత్రికల్లో వచ్చిన కథనాల ఆధారంగా ఈ కేసును సుమోటోగా స్వీకరించింది. ప్రతివాదులుగా హోంశాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీ, సీపీలను చేర్చింది. అలాగే నార్త్ జోన్ డీసీపీ, గోపాలపురం ఏసీపీ, తుకారాంగేట్ ఎస్‌హెచ్‌వోను కూడా ఇందులో ప్రతివాదులుగా హైకోర్టు చేర్చింది. బుధవారం చిరంజీవి మృతి చెందిన కేసులో తమకు న్యాయం కావాలని కుటుంబ సభ్యులు ఆందోళనలు చేశారు.
అసలేం జరిగింది: సైదాబాద్ సింగరేణి కాలనీకి చెందిన చిరంజీవిని సెల్‌ఫోన్ చోరీ కేసులో తుకారాం గేట్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితునిని విచారిస్తుండగా కుప్పకూలడంతో పోలీసులు గాంధీ ఆసుపత్రికి తరలించారు. అతను చికిత్స పొందుతూ మరణించాడు. చిరంజీవి హఠాన్మరణంతో.. పోలీసులే కొట్టి చంపారంటూ మృతుడి బంధువులు గాంధీ ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. నిందితుడికి ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని పోలీసులు కొట్టడంతోనే మరణించారని కుటుంబీకులు ఆరోపించారు. పోలీసుల విచారణలో మరణించాడనే ఆరోపణలతో.. మృతుడి బంధువులు ఆందోళనకు దిగారు. రోడ్డుపై బైఠాయించడంతో గాంధీ ఆసుపత్రి ముందు భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది.