వినాయక నిమజ్జనం(ganesh immersion) ఆంక్షలు, నియంత్రణలపై ప్రభుత్వం సరైన విధంగా స్పందించడం లేదని హైకోర్టు(ts high court) అసంతృప్తి వ్యక్తం చేసింది. నిమజ్జనం సందర్భంగా కాలుష్యం, ఇతర సమస్యలపై ప్రభుత్వానికి శ్రద్ధ లేనట్లుగా ఉందని వ్యాఖ్యానించింది. పీసీబీ మార్గదర్శకాలు ఎందుకు అమలు చేయడం లేదని.. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలను ఎందుకు నిషేధించరాదని ప్రశ్నించింది. నిమజ్జనంపై తామే తగిన ఆదేశాలు జారీ చేస్తామని.. ఉత్తర్వులను రిజర్వ్ చేసింది.
'సీపీకి తీరికే లేదా?'
హుస్సేన్‌సాగర్‌లో(hussain sagar) గణేశ్ నిమజ్జనం నిషేధించాలని కోరుతూ న్యాయవాది మామిడి వేణుమాధవ్ గతంలో దాఖలు చేసిన పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు, జస్టిస్ టి.వినోద్ కుమార్ ధర్మాసనం ఇవాళ మరోసారి విచారణ చేపట్టింది. వినాయక నిమజ్జనంపై సూచనలు ఇవ్వాలని ఇటీవల ప్రభుత్వాన్ని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. అయితే ప్రభుత్వ విభాగాలు నివేదిక సమర్పించకపోవడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. జీహెచ్ఎంసీ(ghmc) నివేదిక సమర్పించినప్పటికీ.. విచారణ ప్రారంభమయ్యే పది నిమిషాల ముందు ఇస్తే ఎలా? అని అసంతృప్తి వ్యక్తం చేసింది. హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌కు(hyderabad cp) నివేదిక ఇచ్చే తీరికే లేనట్లు ఉందని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
'చర్యలు ఎందుకు తీసుకోరాదు?'
కరోనా నేపథ్యంలో నిమజ్జనం సందర్భంగా కాలుష్యం, కొవిడ్(covid) జాగ్రత్తలు తదితర అంశాలపై ప్రభుత్వానికి శ్రద్ధ లేనట్లు ఉందని పేర్కొంది. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి మార్గదర్శకాలు ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించింది. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనం చేయకుండా ఎందుకు చర్యలు తీసుకోరాదని అడిగింది.
'ఏర్పాట్లు చేస్తున్నాం'
జీహెచ్ఎంసీలో హుస్సేన్ సాగర్‌తో పాటు 48 చెరువులు, కొలనుల్లోనూ వినాయక నిమజ్జనానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రభుత్వ తరఫు న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. పీసీబీ మార్గదర్శకాల ప్రకారం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు కాలుష్య కారకాలు కావని పేర్కొన్నారు. మట్టి గణపతులను(eco friendly ganesh) ప్రోత్సహిస్తున్నామని.. హెచ్ఎండీఏ(hmda) ద్వారా లక్ష విగ్రహాలు ఉచితంగా పంపిణీ చేస్తున్నట్లు వివరించారు.
'ప్రభుత్వాల పని కాదు'
ప్రోత్సహించడం, సలహాలు ఇవ్వడం ప్రభుత్వాలు చేయాల్సిన పనికాదు. నిర్దిష్టమైన చర్యలు, స్పష్టమైన మార్గదర్శకాలు ఉండాలి. కాలుష్యం, వాతావరణ మార్పులతో పర్యావరణంపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఇప్పటికే వివిధ దేశాలు సతమతవుతున్నాయి. ప్రస్తుత కరోనా(corona) పరిస్థితుల్లో జనం గుమిగూడకుండా ఏం చర్యలు తీసుకుంటున్నారో కూడా ప్రభుత్వం స్పష్టంగా చెప్పలేక పోతోంది. దీనిపై మేమే తగిన ఆదేశాలు జారీ చేస్తాం.
-తెలంగాణ హైకోర్టు
ఇదీ చదవండి:vote for note case : సుప్రీంకోర్టులో ఓటుకు నోటు కేసు విచారణ