అక్రమాస్తుల కేసులో ఏపీ సీఎం జగన్, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి బెయిల్ రద్దు చేయాలని కోరుతూ నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే, సాంకేతిక కారణాలతో రఘురామ పిటిషన్లను హైకోర్టు రిజిస్ట్రీ వెనక్కి ఇచ్చారు.
ఇదీ జరిగింది
అక్రమాస్తుల కేసులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (AP CM JAGAN), రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి (ycp mp vijaya sai reddy) బెయిల్ రద్దు చేయాలని కోరుతూ వైకాపా ఎంపీ రఘురామ కృష్ణరాజు (mp raghurama krishnam raju) హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రఘురామ కృష్ణరాజు పిటిషన్లను ఇటీవల సీబీఐ కోర్టు కొట్టివేయడంతో... హైకోర్టును ఆశ్రయించారు.
రఘురామ పిటిషన్‌ను నిరాకరించిన సీబీఐ కోర్టు
సీబీఐ కోర్టు విధించిన షరతులు ఉల్లంఘించినందున జగన్, విజయసాయిరెడ్డి బెయిల్ రద్దు చేయాలని రఘురామ ప్రధాన అభ్యర్థన. జగన్, విజయసాయిరెడ్డి సాక్షులను ప్రలోభ పెడుతున్నారని, విచారణ ప్రక్రియను జాప్యం చేస్తున్నారని రఘురామ కృష్ణ రాజు సీబీఐ కోర్టులో వాదించారు. అయితే తాము ఎలాంటి షరతులు ఉల్లంఘించలేదని.. వ్యక్తిగత ప్రచారం, రాజకీయ ప్రయోజనాల కోసమే రఘురామ పిటిషన్లు దాఖలు చేశారని జగన్, విజయ్ సాయిరెడ్డి సీబీఐ కోర్టులో వాదించారు. సీబీఐ మాత్రం ఏమీ వాదించకుండా.. పిటిషన్లలోని అంశాలపై చట్టప్రకారం విచక్షణ మేరకు నిర్ణయం తీసుకోవాలని పేర్కొంది. సుదీర్ఘ వాదనల అనంతరం... రఘురామ పిటిషన్లను కొట్టివేసిన సీబీఐ కోర్టు.. జగన్, విజయసాయిరెడ్డి బెయిల్ రద్దు చేసేందుకు తగిన కారణాలు లేవని పేర్కొంది.
సీబీఐ కోర్టు తీర్పును సవాలు చేస్తూ
అయితే సీబీఐ కోర్టు పలు అంశాలను పరిగణనలోకి తీసుకోలేదంటూ రఘరామ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రఘురామ కృష్ణరాజు పిటిషన్లు హైకోర్టు రిజిస్ట్రీ సాంకేతిక కారణాలతో వెనక్కి ఇచ్చేసింది.
ఇదీ చూడండి:జగన్ బెయిల్ రద్దు చేయాలని హైకోర్టులో రఘురామ పిటిషన్