తెలంగాణ

telangana

ETV Bharat / state

ఎమ్మెల్యేలకు ఎర కేసు.. సీబీఐకి ఇవ్వడానికి హైకోర్టు నిరాకరణ - సీబీఐకి ఇవ్వడానికి హైకోర్టు నిరాకరణ

ఎమ్మెల్యేలకు ఎర కేసు.. సీబీఐకి ఇవ్వడానికి హైకోర్టు నిరాకరణ
ఎమ్మెల్యేలకు ఎర కేసు.. సీబీఐకి ఇవ్వడానికి హైకోర్టు నిరాకరణ

By

Published : Nov 15, 2022, 1:48 PM IST

Updated : Nov 15, 2022, 4:39 PM IST

13:42 November 15

ఎమ్మెల్యేలకు ఎర కేసు.. సీబీఐకి ఇవ్వడానికి హైకోర్టు నిరాకరణ

‘తెరాస ఎమ్మెల్యేలకు ఎర’ కేసును సీబీఐకి అప్పగించేందుకు తెలంగాణ హైకోర్టు నిరాకరించింది. ఈ వ్యవహారంలో భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను ఉన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. భాజపా నేత దాఖలు చేసిన పిటిషన్‌పై సీజే జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ కేసుపై సిట్‌ ఆధ్వర్యంలోనే దర్యాప్తు కొనసాగించాలని హైకోర్టు స్పష్టం చేసింది.

దర్యాప్తులో పురోగతిని ఈ నెల 29న జస్టిస్ విజయసేన్ రెడ్డి బెంచ్‌కు అందించాలని సిట్‌ను ఆదేశించింది. దర్యాప్తునకు సంబంధించిన విషయాలను రాజకీయ నాయకులకు, మీడియాకు, కార్య నిర్వాహక వ్యవస్థకు ఎట్టి పరిస్థితుల్లోనూ లీక్ చేయొద్దని... ఒకవేళ అలా జరిగితే తగిన చర్యలు తీసుకొంటామని సీజే ధర్మాసనం తెలిపింది. సిట్ దర్యాప్తును జస్టిస్ విజయసేన్ రెడ్డి పర్యవేక్షిస్తారని సీజే తెలిపారు. ప్రభుత్వం నుంచి సీల్డ్ కవర్‌లో కొన్ని పేపర్లు, సీడీలు వచ్చాయని.... ఇదేంటని ప్రభుత్వం తరఫు న్యాయవాదిని సీజే ప్రశ్నించారు. ఫామ్ హౌజ్‌లో చోటు చేసుకున్న సంభాషణలు సంబంధించిన సీడీలు అని... సీల్డ్ కవర్‌లో పంపించడం పట్ల ప్రభుత్వ తరఫు న్యాయవాది సీజేకు క్షమాపణ చెప్పారు. భాజపా పిటిషన్‌పై సీజే ధర్మాసనం విచారణ ముగించింది.

దీనిపై బండి సంజయ్ ప్రకటన...ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై హైకోర్టు సిట్టింగ్‌ జడ్జి పర్యవేక్షణలో సిట్‌ విచారణ చేపట్టాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేయడం హర్షణీయమని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ తెలిపారు. ఈమేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ‘‘సిట్టింగ్‌ జడ్జి పర్యవేక్షణలో సిట్‌ విచారణ జరపాలన్నదే భాజపా అభిప్రాయం. గౌరవ హైకోర్టు ఉత్తర్వులతో విచారణ పారదర్శకంగా జరిగే అవకాశముంది. భాజపా ప్రతిష్టను దెబ్బతీయాలని తెరాస ప్రభుత్వం కుట్ర చేస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ భాజపాపై ఆరోపణలు చేస్తూ ప్రెస్‌మీట్‌ నిర్వహించడమే ఇందుకు నిదర్శనం.

సీఎం ప్రెస్‌మీట్‌ నిర్వహించడం పట్ల హైకోర్టు ధర్మాసనం చేసిన వ్యాఖ్యలు అభినందనీయం. సిట్‌ దర్యాప్తు పురోగతి వివరాలను బహిర్గతపర్చకూడదని, ఈనెల 29లోపు పురోగతి నివేదికను సీల్డ్‌ కవర్‌లో సింగిల్‌ జడ్జికి సమర్పించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేయడాన్ని స్వాగతిస్తున్నాం. తప్పు చేసిన వాళ్లకు, కుట్రదారులకు శిక్ష పడాల్సిందే. తెలంగాణ ప్రజలు కోరుకునేది కూడా ఇదే. గౌరవ హైకోర్టు ధర్మాసనం పట్ల మాకు నమ్మకం ఉంది. వాస్తవాలు వెలుగులోకి వస్తాయని, ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం వెనుక కుట్రదారులెవరన్నది తేలడంతో పాటు దోషులకు తగిన శిక్ష పడుతుందనే నమ్మకం ఉంది’’ అని బండి సంజయ్‌ పేర్కొన్నారు.

ఇవీ చదవండి:

Last Updated : Nov 15, 2022, 4:39 PM IST

ABOUT THE AUTHOR

...view details