High Court Questioned Why TSPSC Paper Leakage Case Transferred To CBI : టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసుపై సిట్ దర్యాప్తు జరుగుతున్నందున.. ప్రస్తుత దశలో సీబీఐకి బదిలీ చేయాల్సిన అవసరమేంటని హైకోర్టు ప్రశ్నించింది. ప్రశ్నపత్రాల లీకేజీపై దర్యాప్తును సీబీఐకి బదిలీ చేయాలని కోరుతూ ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్‌తో పాటు పలువురు అభ్యర్థులు దాఖలు చేసిన పిటిషన్లపై ఇవాళ మరోసారి విచారణ జరిగింది. ప్రశ్నపత్రాల లీకేజీపై దర్యాప్తు చురుగ్గా, నిష్పక్షపాతంగా జరుగుతోందని.. అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ తెలిపారు.
నిందితుల్లో 37 మందిపై ఛార్జిషీట్ కూడా వేసినట్లు వివరించారు. సిట్ దర్యాప్తు పూర్తిస్థాయిలో జరగడం లేదని.. ఒత్తిళ్లకు గురవుతోందని.. అందుకే సీబీఐకి బదిలీ చేయాలని పిటిషనర్ల న్యాయవాదులు వాదించారు. సిట్ దర్యాప్తు జరుగుతుండగా.. ఇప్పుడు సీబీఐకి ఎందుకు బదిలీ చేయడం అని హైకోర్టు ప్రశ్నించింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని సిట్‌ను, టీఎస్‌పీఎస్సీను జస్టిస్ సి.వి.భాస్కర్‌రెడ్డి ఆదేశించారు. ఇందుకు సంబంధించిన విచారణను మూడు వారాలకు వాయిదా వేస్తున్నట్లు తెలిపారు.
ఛార్జిషీట్ దాఖలు చేసిన సిట్ : టీఎస్‌పీస్సీ పేపర్ లీకేజీ కేసులో సిట్ అధికారులు నాంపల్లి కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేశారు. ఇప్పటివరకు రూ.1.63 కోట్ల లావాదేవీలు జరిగినట్లు ఛార్జిషీట్‌లో సిట్ తెలిపింది.నిందితులను, వారికి సంబంధించిన బ్యాంకు వివరాలను, ఎవరెవరికి నగదు చేతులు మారిందనే వివరాలను అందులో తెలిపారు. ఇంకా ఈ కేసులో మరికొంత మందిని అరెస్టు చేయాలని భావిస్తున్నట్లు చెప్పారు.