Highcourt on CS Someshkumar Allotment: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ క్యాడర్ కేటాయింపు వివాదంపై హైకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. తెలంగాణలో సోమేశ్‌కుమార్ కొనసాగింపును ధర్మాసనం రద్దు చేసింది. ఏపీకి కేటాయిస్తూ కేంద్రం ఇచ్చిన ఉత్తర్వులను క్యాట్ కొట్టివేయడాన్ని ఉన్నత న్యాయస్థానం తప్పుపట్టింది. 1989 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన సోమేశ్ కుమార్.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వివిధ హోదాల్లో పనిచేసి.. విభజన సమయంలో జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా ఉన్నారు.
రాష్ట్ర విభజన సమయంలో సోమేశ్ కుమార్‌ను కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించింది. తనను తెలంగాణకు కేటాయించాలని సోమేశ్ కుమార్ కోరినప్పటికీ.. 2015లో సవరించిన ఉత్తర్వుల్లోనూ ఏపీకే కేటాయించింది. కేంద్ర నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సోమేష్ కుమార్ క్యాట్‌ను ఆశ్రయించారు. వాదనలన్నీ విన్న క్యాట్.. సోమేష్‌కుమార్‌ను ఏపీ కేటాయిస్తూ కేంద్రం ఇచ్చిన ఉత్తర్వులను కొట్టివేసి.. తెలంగాణ క్యాడర్‌గా పరిగణించాలని 2016లో తీర్పు వెల్లడించింది. అప్పటి నుంచి వివిధ హోదాల్లో కొనసాగిన సోమేష్ కుమార్... మూడేళ్లుగా సీఎస్‌గా ఉన్నారు.
సోమేశ్‌కుమార్‌ను తెలంగాణ క్యాడర్‌గా పరిగణించాలన్న క్యాట్ తీర్పును సవాల్ చేస్తూ డీఓపీటీ 2017లో హైకోర్టును ఆశ్రయించింది. సోమేశ్‌కుమార్ పిటిషన్‌పై సుదీర్ఘ వాదనలు జరిగాయి. సోమేశ్ తరఫున మాజీ ఏజీ డీవీ సీతారామమూర్తి, కేంద్రం తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ సూర్యకరణ్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ వాదించారు. ఉత్తర్‌ప్రదేశ్ విభజన సమయంలో అగర్వాల్ కమిటీ సూచనలకు.. ఏపీ క్యాడర్ విభజనపై ప్రత్యూష్ సిన్హా కమిటీ భిన్నంగా వ్యవహరించిందని సోమేష్ కుమార్ వాదించారు. ప్రత్యూష్ సిన్హా కమిటీలో సభ్యుడిగా ఉన్న అప్పటి సీఎస్ పీకే మొహంతి ఐఏఎస్ అధికారులైన తన కుమార్తె, అల్లుడికి ప్రయోజనం కలిగించేలా వ్యవహరించారని వాదించారు. కేడర్ విభజించేటప్పుడు పీకే మొహంతి పేరును జాబితాలో చేర్చలేదని మరో వాదనలు వినిపించారు.