High Court Orders to Allow Shia Women to Enter Synagogues : మసీదు, జాషన్స్, ఇతరప్రార్థనా మందిరాల్లోకి షియా తెగకు చెందిన మహిళలను ప్రార్థనల నిమిత్తం అనుమతించకపోవడాన్ని హైకోర్టు(Highcourt) తప్పుపట్టింది. మహిళల పట్ల వివక్ష తగదని, రాజ్యాంగం(Indian Constitution) కల్పించిన హక్కులను కాలరాయవద్దని వ్యాఖ్యానించింది. ప్రార్థనా మందిరాల్లోకి అనుమతించాలంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
మసీదు, జాషన్స్ తదితర పవిత్ర ప్రాంతాల్లో ప్రార్థనలకు షియా ముస్లిం మహిళలను అనుమతించకపోవడాన్ని సవాల్ చేస్తూ అంజుమన్ ఎ అలవి, షియా ఇమామియా ఇత్నా అషారి అక్బరీ సొసైటీ కార్యదర్శి ఆస్మా ఫాతిమా పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ నగేష్ భీమపాక విచారణ చేపట్టారు. పిటిషన్ తరఫున సీనియర్ న్యాయవాది(Senior Advocate) వాదనలు వినిపిస్తూ ఇబ్దత్ ఖానాకు చెందిన ముత్తవలీల కమిటీ కేవలం షియా తెగకు చెందిన మహిళలను అనుమతించడం లేదన్నారు.
ప్రార్థనల నిమిత్తం ప్రార్థనా మందిరాల్లోకి అనుమతించాలని వక్ఫ్ బోర్డుకు వినతి పత్రాలు ఇచ్చినా స్పందించడం లేదన్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోవడం లేదన్నారు. వక్ఫ్ బోర్డు(WAQF Board) తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ ఖురాన్ ప్రకారమే ప్రార్థనా మందిరాల్లోకి అనుమతి ఉంటుందని తెలిపారు. దీనిపై స్పందించిన న్యాయమూర్తి జస్టిస్ నగేష్ భీమపాక, మహిళల పట్ల వివక్ష ప్రదర్శించడం తగదని, రాజ్యాంగం హక్కులను హరించడానికి వీల్లేదన్నారు.