తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆధార్​ వివరాలు అడగొద్దు... స్లాట్​ బుకింగ్​ నిలిపేయండి: హైకోర్టు - తెలంగాణ హైకోర్టు వార్తలు

వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ల కోసం ఆధార్ వివరాలు అడగరాదని హైకోర్టు స్పష్టం చేసింది. సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేసే వరకు ఆన్‌లైన్ స్లాట్ బుకింగ్, పీటీఐఎన్​ దరఖాస్తులు నిలిపేయాలని ప్రభుత్వాన్ని న్యాయస్థానం ఆదేశించింది. రిజిస్ట్రేషన్లు యథావిథిగా కొనసాగించవచ్చన్న ధర్మాసనం.. గుర్తింపు కోసం ఆధార్ కాకుండా ఇతర అధికారిక పత్రాలు అడగొచ్చని తెలిపింది.

ఆధార్​ వివరాలు అడగొద్దు... స్లాట్​ బుకింగ్​ నిలిపేయండి: హైకోర్టు
ఆధార్​ వివరాలు అడగొద్దు... స్లాట్​ బుకింగ్​ నిలిపేయండి: హైకోర్టు

By

Published : Dec 17, 2020, 8:11 PM IST

వ్యవసాయేతర రిజిస్ట్రేషన్ల మ్యానువల్, సాఫ్ట్‌వేర్‌లో ఆధార్, కులం, కుటుంబ సభ్యుల వివరాలకు సంబంధించిన అంశాలు తొలగించే వరకు ఆన్‌లైన్ స్లాట్ బుకింగ్, పీటీఐఎన్​ దరఖాస్తులు ఆపాలని హైకోర్టు ఆదేశించింది. రిజిస్ట్రేషన్ల కోసం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆధార్ వివరాలు అడగొద్దని స్పష్టం చేసింది. ధరణిలో ఆస్తుల నమోదుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాలపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్​ఎస్​ చౌహాన్, జస్టిస్ విజయ్ సేన్ రెడ్డి ధర్మాసనం మరోసారి విచారణ చేపట్టింది.

మేం అడగలేదు... ఇస్తే వద్దనలేదు

ఆధార్, కులం, కుటుంబ సభ్యుల వివరాలు అడగబోమని అడ్వకేట్ జనరల్ హామీ ఇచ్చినప్పటికీ.. స్లాట్ బుకింగ్, పీటీఐఎన్ దరఖాస్తుల పేరిట ఆ వివరాలు సేకరిస్తున్నారని పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది ప్రకాష్ రెడ్డి హైకోర్టు దృష్టికి తెచ్చారు. ఆధార్ వివరాల సేకరణపై వివరణ ఇస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్​ కుమార్ హైకోర్టుకు అఫిడవిట్ దాఖలు చేశారు. ఆధార్ వివరాలను కచ్చితంగా నమోదు చేయాలని అడగటం లేదని... అది ఐచ్ఛికమేనని సీఎస్​ తెలిపారు. సీఎస్​ వివరణపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆధార్ వివరాలు అడగబోమని స్పష్టమైన హామీ ఇచ్చి.. ఇప్పుడు స్వచ్ఛందంగా ఇస్తే నమోదు చేస్తున్నామనడం సమంజసం కాదని పేర్కొంది.

ఆధార్​ అడగటానికి వీల్లేదు..

స్వచ్ఛందంగా ఇస్తే ఆధార్​ వివరాలు తీసుకుంటామని న్యాయస్థానానికి చెప్పలేదని హైకోర్టు ప్రస్తావించింది. ప్రభుత్వం చాటుగా ప్రజల వ్యక్తిగత వివరాలను సేకరించడాన్ని అంగీకరించేది లేదని స్పష్టం చేసింది. ప్రభుత్వం తెలివిగా న్యాయస్థానాన్ని ఫూల్‌ని చేసిందని ఘాటుగా వ్యాఖ్యానించింది. వ్యవసాయేతర రిజిస్ట్రేషన్ల కోసం ఏ రూపంలోనూ ఆధార్ వివరాలు అడగడానికి వీల్లేదని హైకోర్టు స్పష్టం చేసింది. రిజిస్ట్రేషన్ల స్లాట్ బుకింగ్, పీటీఐఎన్​ దరఖాస్తుల ప్రక్రియలో ఆధార్, కులం, కుటుంబ సభ్యుల వివరాలు తొలగించాలని ఆదేశించింది. సమాచార భద్రతపైనే మొదట్నుంచీ తాము ఆందోళన వ్యక్తం చేస్తున్నామని ధర్మాసనం తెలిపింది. వ్యవసాయేతర రిజిస్ట్రేషన్లను కొనసాగించవచ్చునని ప్రభుత్వానికి ధర్మాసనం తెలిపింది. రిజిస్ట్రేషన్ల కోసం ఆధార్ వివరాలు మాత్రం అడగవద్దని.. అవసరమైన ఇతర ప్రభుత్వ గుర్తింపు పత్రాలు అడగవచ్చని పేర్కొంది.

సాఫ్ట్‌వేర్, మాన్యువల్​ మార్పులు చేసేందుకు వారం పడుతుందని ఏజీ బీఎస్ ప్రసాద్ తెలిపారు. సవరించిన సాఫ్ట్‌వేర్, మ్యానువల్‌ను తమకు సమర్పించాలని ఏజీని ఆదేశిస్తూ.. విచారణను ఈనెల 28కి వాయిదా వేసింది. ధరణిలో సాగుభూముల ఆస్తుల నమోదు ప్రక్రియలో అభ్యంతరాలను సోమవారం విచారణ జరుపుతామని హైకోర్టు తెలిపింది.

ఇదీ చూడండి:నేరస్థుల పాలిట సింహ స్వప్నంగా రాచకొండ కమిషనరేట్​

ABOUT THE AUTHOR

...view details