High Court Judgment on Baswapur Reservoir Lands : కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో చేపట్టిన బస్వాపూర్ రిజర్వాయర్ కోసం సేకరించిన భూములకు జూన్ నెలాఖరులోగా పరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. బస్వాపూర్ రిజర్వాయర్ నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం 2019లో నోటిఫికేషన్ ఇచ్చింది. నోటిఫికేషన్‌లో భాగంగా భువనగిరి మండలం బి.ఎన్. తిమ్మాపూర్‌లోని విఖ్యాత్ ఇన్ ఫ్రా డెవలపర్స్‌కు చెందిన 4 లక్షల 65 వేల చదరపు గజాల భూమిని ప్రభుత్వం సేకరించింది.
భూమి సేకరించినప్పటికీ తమకు రావాల్సిన సొమ్ము ఇవ్వడం లేదంటూ విఖ్యాత్ ఇన్‌ఫ్రా తరఫున సంస్థ ఎండీ జి.శ్రీధర్ రెడ్డి వేసిన పిటిషన్‌పై ఇటీవల హైకోర్టులో విచారణ జరిగింది. నిధులు అందుబాటులో లేకుండా భూసేకరణ చేయడం తగదని.. ఎప్పటిలోగా పరిహారం చెల్లిస్తారో లిఖిత పూర్వకంగా తెలపాలని గతంలో ప్రభుత్వాన్ని న్యాయమూర్తి జస్టిస్ ఎం.సుధీర్ కుమార్ ఆదేశించారు. ఈ నేపథ్యంలో మూడు విడతల్లో రూ.600 కోట్లు జూన్ నెలాఖరులోగా చెల్లిస్తామని ప్రభుత్వం తరఫు న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. ఇచ్చిన హామీ మేరకు పరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ పిటిషన్‌పై విచారణను ముగించారు.
నిర్వాసితుల బాధలు తీరేదెప్పుడో..!:మరోవైపు ప్రభుత్వం ప్రాజెక్టు కోసం ఇస్తున్న పైసలు ప్రాజెక్టు కోసం భూములు ఇచ్చిన తమకు ఇవ్వడం లేదని బస్వాపూర్ నిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రిజర్వాయర్ కోసం ఉన్న ఊరును, తమ పంట పొలాలను, ఆస్తులను వదిలి వచ్చేశామని అయినా ప్రభుత్వం తమ గోడును పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జలాశయం పనులు తుదిదశకు చేరుకున్నాయని నీరు వదలడమే తరువాయని.. అయినా తమకు పరిహారం చెల్లించడం లేదని మండిపడుతున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు.
Baswapur Reservoir Residents Issues: 2009వ సంవత్సరంలో 0.8 టీఎంసీ సామర్థంతో ఈ ప్రాజెక్టును ప్రారంభించారు. అప్పట్లో 650 ఎకరాలు ప్రాజెక్టు నిర్మాణం కోసం సేకరించాలని ప్రభుతం అనుకుంది. 2015లో సీఎం కేసీఆర్ ప్రాజెక్టును రీడిజైన్ చేసి 11.38 టీఎంసీలకు సామర్థం పెంచి లక్షపై చిలుకు ఎకరాలకు సాగు అందించడానికి ప్లాన్ చేశారు. ఆ తరువాత భూ సేకరణ చేసి కొందరికి పరిహారం ఇవ్వగా మరికొందరికి పరిహారం అందచకపోవడం వారు ఆవేదన చెందుతున్నారు.