కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన అనంతగిరి రిజర్వాయర్ ప్రాజెక్టు భూ నిర్వాసితుల పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ చేపట్టింది. భూ నిర్వాసితులకు మూడు నెలల్లో పరిహారం, పునరావాసం ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ వివాదానికి సంబంధించిన పిటిషన్లన్నీ కోర్టులు పున:ప్రారంభమయ్యే వరకూ వాయిదా వేయాలన్న అడ్వొకేట్ జనరల్ అభ్యర్థనను ఉన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. పిటిషనర్లకు ఒక్కొక్కరికి రెండు వేల రూపాయల చొప్పున జరిమానా చెల్లించాలని సర్కారుకు తెలిపింది.
భూములు కోల్పోయిన రైతులకు
అనంతగిరి సాగర్ రిజర్వాయర్ నిర్మాణంలో భూములు కోల్పోయిన రైతులకు పరిహారం సొమ్మును తాజాగా ఖరారు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. తమకు పరిహారం చెల్లింపులో అన్యాయం జరిగిందంటూ సిద్దిపేట జిల్లా చిన్నకొండూరు మండలం అల్లీపురం, రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలానికి చెందిన 120 మంది హైకోర్టును ఆశ్రయించారు. అయితే కొంతకాలంగా విచారణ జరుగుతున్న నాలుగు పిటిషన్లు.. ఇటీవల జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు, జస్టిస్ కె.లక్ష్మణ్ ధర్మాసనం వద్దకు వచ్చింది.
ధర్మాసనం తుది తీర్పు..
పిటిషన్లను అత్యవసర కేసులుగా పరిగణించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ చేపట్టాల్సిన అవసరం లేదని.. కోర్టులో సాధారణ విచారణ పునరుద్ధిరించే వరకు వాయిదా వేయాలని కోరుతూ ఇటీవల అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ మెమో దాఖలు చేశారు. అడ్వకేట్ జనరల్ అభ్యర్థన సహేతుకంగా లేదని మెమో కొట్టివేసిన ధర్మాసనం తుది తీర్పు వెల్లడించింది. ప్రభుత్వం మార్కెట్ ధర చెల్లించకుండా బలవంతంగా భూములు లాక్కుందన్న పిటిషనర్ తరఫు న్యాయవాది రచనరెడ్డి వాదనను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం.. రైతులతో, ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలు చెల్లవని స్పష్టం చేసింది. నిర్వాసితులకు చట్టబద్ధమైన పరిహారం చెల్లించకపోవడం రాజ్యాంగ ఉల్లంఘనేనని పేర్కొంది.
పరిహారాన్ని మళ్లీ నిర్ధారించాలని
భూములు ఖాళీ చేసిన తేదీని పరిగణనలోకి తీసుకుని.. 2013 భూసేకరణ చట్టం ప్రకారం రైతులు రావాల్సిన పరిహారాన్ని మళ్లీ నిర్ధారించాలని హైకోర్టు ఆదేశించింది. మూడు నెలల్లో చట్టప్రకారం పరిహారం, పునరావాసం చెల్లించాలని స్పష్టం చేసింది. రైతులకు 2017 చట్టం ప్రకారం ఇప్పటికే ఇచ్చిన సొమ్మును వెనక్కి తీసుకోవద్దని తెలిపింది.. మిగిలిన సొమ్ము జమ చేయాలని ఆదేశించింది. పిటిషనర్లను మనోవేదనకు గురి చేసినందునకు ఒక్కొక్కిరికి 2 వేల రూపాయల చొప్పున జరిమానా చెల్లించాలని ప్రభుత్వాన్ని ధర్మాసనం ఆదేశించింది.
ఇదీ చూడండి :నెదర్లాండ్స్ నుంచి మమ్మల్ని తీసుకెళ్లండి..!