High Court Verdict on Reservation for Local Students in Medical Colleges :రాష్ట్రావతరణ తర్వాత ఏర్పాటైన వైద్య కళాశాలల్లో కాంపిటెంట్ కోటాలోని 85 శాతం సీట్లను తెలంగాణ విద్యార్థులకే దక్కుతాయంటూ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు సమర్థించింది. ఈ మేరకు నిబంధనలు సవరించే అధికారం ప్రభుత్వానికి ఉంటుందని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. పునర్విభజన చట్టంలోని షరతు రాష్ట్రావిర్భావానికి ముుందున్న కళాశాలలకే వర్తిస్తుందని తెలిపింది. ప్రభుత్వ నిర్ణయం రాష్ట్రపతి ఉత్తర్వులు, పునర్విభజన చట్టం, సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా లేదని తేల్చి చెప్పింది. ఆలిండియా కోటాలోని 15 శాతం సీట్లకు ఇతర రాష్ట్రాల విద్యార్థులు ప్రయత్నించవచ్చని హైకోర్టు పేర్కొంది.
Telangana Local Candidate in Medical Colleges Issue :రాష్ట్రంలోని వైద్య కళాశాలల్లోని ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్ల భర్తీలో తెలంగాణ విద్యార్థుల రిజర్వేషన్లపై హైకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. రాష్ట్రావిర్భావం తర్వాత ఏర్పడిన మెడికల్ కాలేజీల్లో ఆలిండియా కోటాలో 15 శాతం పోగా మిగిలిన 85 శాతం సీట్లన్నీ తెలంగాణ విద్యార్థులకే దక్కుతాయని.. ప్రభుత్వ ఉత్తర్వులను ఉన్నత న్యాయస్థానం సమర్థించింది. తెలంగాణలో కాంపిటెంట్ కోటాలో రాష్ట్రావిర్భావానికి ముందున్న 20 కాలేజీల్లో.. 2,850 సీట్లుండగా.. ఆ తర్వాత ఏర్పడిన 34 కాలేజీల్లో 8,215 సీట్లు ఉన్నాయి.
తెలంగాణ వచ్చిన తర్వాత ఏర్పడిన 34 కాలేజీల్లో కాంపిటెంట్ కోటాలోని 85 శాతం సీట్లన్నీ రాష్ట్ర విద్యార్థులకే దక్కుతాయని.. జులై 3న ప్రభుత్వం ఉత్తర్వులు(Government Orders) జారీ చేసింది. జీవో 72ను సవాల్ చేస్తూ 63 మంది ఏపీ విద్యార్థులు వేసిన పిటిషన్లపై.. సుదీర్ఘ వాదనల తర్వాత సీజే జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ శ్రావణ్ కుమార్ ధర్మాసనం తీర్పు వెల్లడించింది.