పీఆర్సీకి చట్టబద్ధత లేదని, ఆ కమిషన్ సిఫార్సులే చేయగలదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హైకోర్టులో కౌంటరు వేసింది. ఆ సిఫార్సులను అంగీకరించాలా, లేదా అనేది ప్రభుత్వ విచాక్షణాధికారం అని తెలిపింది. అశుతోష్ మిశ్ర కమిషన్ చేసిన మొత్తం 18 సిఫార్సుల్లో పదకొండింటిని నేరుగా, మరో ఐదింటిని సవరణలతో ప్రభుత్వం అంగీకరించిందని, రెండింటినే తిరస్కరించిందని పేర్కొంది. ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్‌ఎస్ రావత్ కోర్టులో ఈ కౌంటరు దాఖలు చేశారు. ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటరుకు తిరుగు సమాధానం ఇచ్చేందుకు పిటిషనరు తరఫు న్యాయవాది పి.రవితేజ సమయం కోరడంతో విచారణ నాలుగు వారాలకు వాయిదా పడింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్ర, జస్టిస్ ఎం.సత్యనారాయణమూర్తిలతో కూడిన ధర్మాసనం బుధవారం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.
జనవరి 17న ఏపీ ప్రభుత్వం ఇచ్చిన పీఆర్సీ ఉత్తర్వులను సవాలుచేస్తూ ఏపీ గెజిటెడ్ అధికారుల ఐకాస ఛైర్మన్ కేవీ కృష్ణయ్య హైకోర్టులో వ్యాజ్యం వేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన ధర్మాసనం.. కమిషన్ నివేదికతో పాటు, కౌంటరు దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి హైకోర్టులో కౌంటరు వేశారు.
కౌంటర్లో పేర్కొన్న వివరాలు ఇవే..
‘కోర్టు ఆదేశాల మేరకు పీఆర్సీ విషయంలో ప్రభుత్వం ఇచ్చిన జీవోలను పిటిషనరు తరఫు న్యాయవాదికి అందజేశాం. ఉద్యోగ సంఘాలతో చర్చల అనంతరం ఈ ఏడాది జనవరి 17న సవరించిన పేస్కేలు విషయంలో జీవో 1ని జారీచేశాం. హైదరాబాద్ నుంచి వచ్చిన ఉద్యోగులకు 30% హెచ్‌ఆర్‌ఏ ఇవ్వడం ప్రభుత్వ విధానపరమైన, తాత్కాలిక నిర్ణయం. దాన్ని కొనసాగించాలంటూ పిటిషనరు చేస్తున్న అభ్యర్థన ఆమోదయోగ్యం కాదు.