High Court on MLC Dande Vithal : ఎమ్మెల్సీ దండే విఠల్(Dande Vithal) ఎన్నిక వివాదం హైకోర్టులో కీలక మలుపు తిరిగింది. పాతిరెడ్డి రాజేశ్వర్ రెడ్డి నామినేషన్ ఉపసంహరణ పత్రాలపై సంతకాలను తేల్చేందుకు కేంద్ర ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీకి పంపించాలని హైకోర్టు ఆదేశించింది. ఆదిలాబాద్ స్థానిక సంస్థల నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా 2022లో దండే విఠల్ గెలిచారు. అయితే తాను నామినేషన్ ఉపసంహరించుకోలేదని.. తన సంతకాలు ఫోర్జరీ చేశారని పాతిరెడ్డి రాజేశ్వర్ రెడ్డి 2022లోనే హైకోర్టును ఆశ్రయించారు. దండె విఠల్ ఎన్నిక చెల్లదని ప్రకటించాలని రాజేశ్వర్ రెడ్డి కోరారు. ఫోర్జరీ పత్రాలని తేల్చేందుకు పత్రాలను కేంద్ర ఫోరెన్సిక్ లేబొరేటరీకి పంపించాలని కోరారు.
MLC Dande Vithal Election Controversy : రాజేశ్వర్ రెడ్డి(Rajeswar Reddy) పిటిషన్ కొట్టివేయాలని విఠల్ వాదించారు. ఇరువైపుల వాదనలు విన్న జస్టిస్ లక్ష్మణ్ మధ్యంతర ఉత్తర్వులు వెల్లడించారు. రాజేశ్వర్ రెడ్డి నామినేషన్, ఉపసంహరణ పత్రంతో పాటు హైకోర్టులో వేసిన అఫిడవిట్, వకాలత్‌ను రామంతపూర్ సీఎఫ్ఎస్ఎల్కు పంపించాలని జ్యుడీషియల్ రిజిస్ట్రార్‌ను హైకోర్టు ఆదేశించింది. రాజేశ్వర్ రెడ్డి సంతకాలను నిర్ధారించాలని సీఎఫ్ఎస్ఎల్ను కోరాలని.. దానికయ్యే ఖర్చును పిటిషనర్ రాజేశ్వర్ రెడ్డి భరించాలని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.
Adilabad MLC Interview : ఆదిలాబాద్‌లో తెరాస అభ్యర్థి దండె విఠల్ విజయం
High Court onMLA Satish Kumar :మరో కేసులో హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీశ్ కుమార్ ఎన్నిక వివాదంపై హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో విచారణ కోసం అడ్వకేట్ కమిషన్‌ను నియమించింది. హుస్నాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 2018లో బీఆర్ఎస్ అభ్యర్థిగా సతీశ్ కుమార్ సమీప ప్రత్యర్థి సీపీఐ నేత(CPI Leader) చాడ వెంకట్ రెడ్డిపై గెలిచారు. అయితే ప్రజా ప్రాతినిధ్య చట్టానికి అనుగుణంగా సతీశ్ కుమార్ అఫిడవిట్ లేదని.. ఆయన ఎన్నిక రద్దు చేయాలని 2019లో చాడ వెంకట్ రెడ్డి వేసిన పిటిషన్‌పై ఇవాళ మరోసారి విచారణ జరిగింది. వివాదానికి సంబంధించిన సాక్షుల విచారణ, ఆధారాల పరిశీలన కోసం అడ్వకేట్ కమిషన్‌ను ఏర్పాటు చేసిన న్యాయమూర్తి జస్టిస్ లక్షణ్.. నవంబరు 10లోగా నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. చాడ వెంకట్ రెడ్డి ఎన్నికల పిటిషన్‌ను తిరస్కరించాలన్న సతీశ్ కుమార్ పిటిషన్‌ను ఇప్పటికే హైకోర్టు తోసిపుచ్చింది.