హైదరాబాద్‌లోని కాటేదాన్ పరిసరాల్లో కాలుష్య పరిశ్రమలపై చర్యలు తీసుకోక పోవడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎనిమిదేళ్ల క్రితం నోటీసులు ఇచ్చినప్పటికీ.. ఇప్పటి వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించింది. కాటేదాన్, శాస్త్రిపురం, రాజేంద్రనగర్ తదితర ప్రాంతాల్లో పరిశ్రమలు కాలుష్యం వెదజల్లుతున్నాయని.. అధికారులు చర్యలు తీసుకోవడం లేదని దాఖలైన పలు వ్యాజ్యాలపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, ఎ.అభిషేక్ రెడ్డిల ధర్మాసనం ఇవాళ మరోసారి విచారణ చేపట్టింది. గత ఆదేశాల మేరకు జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్, రాజేంద్రనగర్ ఉప కమిషనర్ ప్రదీప్ కుమార్ వ్యక్తిగతంగా విచారణకు హాజరయ్యారు.
300 ఉంటే మూడని చెబుతారా
కాటేదాన్ పరిసరాల్లో కేవలం మూడే కాలుష్య కారక పరిశ్రమలున్నాయని ఉప కమిషనర్ నివేదికలో పేర్కొన్నారంటూ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. 300 పరిశ్రమలకు నోటీసులు ఇచ్చామని జీహెచ్ఎంసీ కమిషనర్ పేర్కొంటుంటే.. మూడే ఉన్నాయని ఎలా చెబుతారని ప్రశ్నించింది. కాటేదాన్ పరిసరాల్లోని పరిశ్రమలకు 2012లో నోటీసులు ఇచ్చారని.. ఎనిమిదేళ్లయినా ఎందుకు చర్యలు తీసుకోలేదని జీహెచ్ఎంసీ కమిషనర్‌ను ధర్మాసనం ప్రశ్నించింది.