ఎర్రమంజిల్‌లో అసెంబ్లీ నిర్మాణం డిజైన్‌లను సమర్పించాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఆర్ అండ్ బీ చీఫ్ ఇంజినీర్ వ్యక్తిగతంగా కోర్టుకు హాజరై వివరాలు సమర్పించాలని స్పష్టం చేసింది. శాసనసభ నిర్మాణం కోసం ఎర్రమంజిల్‌లో పురాతన భవనాలు కూల్చివేయవద్దని కోరుతూ దాఖలైన పిటిషన్లపై ఇవాళ కూడా విచారణ కొనసాగింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అదనపు అడ్వకేట్ జనరల్ రామచందర్‌రావు వాదనలు వినిపించారు.
అవసరాలకు సరిపోనందుకే...కొత్త భవన నిర్మాణం
ప్రస్తుత అసెంబ్లీ భవనం చాలా ఏళ్ల క్రితం నిర్మించిందని, ప్రస్తుత అవసరాలకు సరిపోవడం లేదని అదనపు ఏజీ వివరించారు. అందుకే ఆధునాతన సౌకర్యాలతో ఎర్రమంజిల్‌లో కొత్త భవనం నిర్మించాలని ప్రభుత్వం సంకల్పించిందని తెలిపారు. ట్రాఫిక్ సమస్య భవన నిర్మాణాలపై ఉన్న సందేహాలపై సమాధానం ఏంటని ధర్మాసనం అడిగింది. శాసనసభ భవన నిర్మాణానికి సంబంధించిన డిజైన్ ఎంపిక దశలోనే ఉందని ఏఏజీ కోర్టుకు తెలిపారు. న్యాయస్థానం విచారణను రేపటికి వాయిదా వేసింది.
ఎర్రమంజిల్ భవనం కూల్చివేత కేసు విచారణ ఇవీ చూడండి: నేలకు రంధ్రాలు చేశాడు.. భూగర్భ జలాలు పెంచాడు!