తెలంగాణ

telangana

ETV Bharat / state

'వెయిటేజీ చట్టబద్ధమే.. కానీ 20 శాతానికి మించరాదు'

ప్రభుత్వ రంగ సంస్థల్లో కాంట్రాక్టు లేదా ఔట్​సోర్సింగ్​ కింద పనిచేసే ఉద్యోగులకు వెయిటేజీని నిర్ణయించే అధికారం ప్రభుత్వానికి ఉందని హైకోర్టు వెల్లడించింది. అయితే అది 20 శాతానికి మించరాదని తేల్చిచెప్పింది. తమ పని ఆధారంగా తప్పనిసరిగా వెయిటేజీ మార్కులు ఇవ్వాలని అడిగే హక్కు ఉద్యోగికి లేదని పేర్కొంటూ హైకోర్టు ఫుల్‌ బెంచ్‌ తీర్పు వెలువరించింది.

high court on contract and outsourcing  jobs
'వెయిటేజీ చట్టబద్ధమే.. కానీ 20 శాతానికి మించరాదు'

By

Published : Sep 20, 2020, 7:03 AM IST

ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసే కాంట్రాక్ట్‌/ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు శాశ్వత నియామకాల్లో వెయిటేజీ మార్కులు ఇచ్చే అధికారం ప్రభుత్వానికి ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. శాశ్వత నియామకాలు చేపట్టినపుడు ఔట్‌సోర్సింగ్‌/కాంట్రాక్ట్‌ సర్వీసుల కింద సేవలందించేవారికి 20 శాతం వెయిటేజీ కల్పించడం తప్పేమీ కాదని పేర్కొంది.

దానికి చట్టబద్ధతా ఉందని, అయితే అది 20 శాతానికి మించకూడదని తేల్చిచెప్పింది. కాంట్రాక్ట్‌/ఔట్‌సోర్సింగ్‌ కింద పనిచేసే ఉద్యోగుల నిమిత్తం నిర్దేశించిన నిబంధన 9(బి) ఆంక్షలను సడలించడానికి అధికారం ఉన్నందున, ఈ సడలింపుతో వారి సేవలకు వెయిటేజీ నిర్ణయించడానికి యజమానిగా ప్రభుత్వానికి అవకాశం ఏర్పడిందని స్పష్టం చేసింది.

ఉద్యోగి అందించే సేవలను అధ్యయనం చేసి వెయిటేజీ కల్పించవచ్చని, దీని ఆధారంగా వెయిటేజీని తప్పనిసరిగా ఇవ్వాలని అడిగే హక్కు మాత్రం తాత్కాలిక ఉద్యోగికి లేదని పేర్కొంటూ, దాన్ని వ్యతిరేకిస్తూ చేసిన వాదనలను తోసిపుచ్చింది. ఈ పిటిషన్‌లలో సర్వీసు నిబంధనలను ఎవరూ సవాలు చేయనందున, వాటి జోలికి వెళ్లలేదని పేర్కొంటూ 86 పేజీల తీర్పు వెలువరించింది.

వివాదానికి మూలం ఏమిటంటే..

2011-12లో ట్రాన్స్‌కో, జెన్‌కో, ఎన్‌పీడీసీఎల్‌, ఎస్పీడీసీఎల్‌ పరిధిలో సబ్‌ఇంజినీర్లు, లైన్‌మెన్‌లు, జూనియర్‌ లైన్‌మెన్‌ల పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఇందులో కాంట్రాక్ట్‌ సర్వీసు వారికి 45 మార్కుల వెయిటేజీ ఇవ్వగా, దానిపై రెగ్యులర్‌ అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. దీన్ని 20 మార్కులకు తగ్గిస్తూ సింగిల్‌ జడ్జి ఇచ్చిన తీర్పును డివిజన్‌ బెంచ్‌ 2014లో సమర్థించింది. ఈ వివాదం సుప్రీం కోర్టు దాకా వెళ్లి తిరిగి హైకోర్టుకు చేరగా, రాష్ట్ర విభజన జరిగిన నేపథ్యంలో తాజాగా పరీక్షలు నిర్వహించాలని సూచించింది.

2017లో తెలంగాణ ప్రభుత్వం, ఉమ్మడి రాష్ట్రంలో వ్యవసాయశాఖ పోస్టుల భర్తీలో కల్పించిన వెయిటేజీ ఇవ్వడానికి నిరాకరించడాన్ని మరో డివిజన్‌ బెంచ్‌ సమర్థించింది. ఈ దశలో 2017లో ట్రాన్స్‌కోలో 1,100 జూనియర్‌ లైన్‌మెన్‌లు, 174 సబ్‌ఇంజనీర్లు, మరో 497 ఇతర పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌లు జారీ అయ్యాయి. ప్రభుత్వ ఆదేశాల మేరకు వైద్యవిధాన పరిషత్‌ తదితరాల కోసం 1,115 స్టాఫ్‌ నర్సులు, 200 ల్యాబ్‌ టెక్నీషియన్‌ పోస్టులు, 238 ఫార్మసిస్ట్‌ గ్రేడ్‌-2 పోస్టుల భర్తీకి 2018లో పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ నోటిఫికేషన్‌లు జారీ చేసింది.

ఇందులో ట్రాన్స్‌కో 20 శాతం వెయిటేజీ ఇస్తున్నట్టు నోటిఫికేషన్‌లో పేర్కొనగా టీఎస్‌ఎన్‌పీడీసీఎల్‌ నిరాకరించింది. ఈ నేపథ్యంలో వెయిటేజీ ఇవ్వడాన్ని, ఇవ్వకపోవడాన్ని సవాలు చేస్తూ పిటిషన్‌లు దాఖలయ్యాయి. హైకోర్టులో రెండు డివిజన్‌ బెంచ్‌లు 2014, 2017లో భిన్నమైన తీర్పులు వెలువరించడం వల్ల ఈ వివాదం మరో బెంచ్‌ ముందుకువచ్చింది. అది ఈ వివాదాన్ని ఫుల్‌బెంచ్‌కు నివేదించింది. ఇలా దాఖలైన పలు పిటిషన్‌లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌.ఎస్‌.చౌహాన్‌, జస్టిస్‌ ఎ.రాజశేఖర్‌రెడ్డి, జస్టిస్‌ పి.నవీన్‌రావులతో కూడిన ఫుల్‌బెంచ్‌ సుదీర్ఘ వాదనల అనంతరం తీర్పు వెలువరించింది.

ఇదీ చూడండి:విచారణ ఉంటే.. సస్పెండ్​ చేయవచ్చు : హైకోర్టు

ABOUT THE AUTHOR

...view details