క్రైస్తవ మతాన్ని ఆచరించే ఏపీ సీఎం జగన్ తిరుమల వెళ్లిన సమయంలో డిక్లరేషన్ ఇవ్వనందున ఆయన ఆ పదవిలో కొనసాగకుండా నియంత్రించాలని కోరుతూ వేసిన కో వారెంటో రిట్ పిటిషన్‌ను రాష్ట్ర హైకోర్టు కొట్టివేసింది. జగన్‌మోహన్‌రెడ్డి క్రైస్తవుడని నిరూపించేందుకు తగిన ఆధారాలు సమర్పించనందున దీన్ని కొట్టివేస్తున్నట్లు పేర్కొంది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ తీర్పు వెలువరించారు.
శ్రీవేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల కోసం తిరుమల వెళ్లిన ముఖ్యమంత్రి.. స్వామి వారి పట్ల విశ్వాసం ఉందని డిక్లరేషన్ ఇవ్వకపోవడంతో గుంటూరు జిల్లాకు చెందిన సుధాకర్‌బాబు హైకోర్టును ఆశ్రయించారు. వెలంపల్లి శ్రీనివాస్, కొడాలి నానితో పాటు తితిదే ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి, అప్పటి ఈవో అనిల్‌కుమార్ సింఘాల్‌లు ఆ పోస్టుల్లో కొనసాగకుండా నియంత్రించాలని పిటిషన్‌లో కోరారు. దీనిపై ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు... చర్చిలో ప్రార్థనలకు హాజరైనంత మాత్రాన ఒక వ్యక్తిని క్రైస్తవుడిగా పరిగణించలేమని పేర్కొంది. జగన్‌మోహన్‌రెడ్డి ఇటీవల విజయవాడలోని గురుద్వారాలో నిర్వహించిన ప్రార్థనల్లో పాల్గొన్నారని.. అంతమాత్రాన ఆయన సిక్కు మతాన్ని అనుసరిస్తున్నట్లు భావించాలా? అని ప్రశ్నించింది.