తెలంగాణ

telangana

By

Published : Oct 2, 2020, 10:17 AM IST

ETV Bharat / state

అక్రమ నిర్బంధాలపై పోలీసులపై ఏపీ హైకోర్టు ఆగ్రహం

వ్యక్తుల అక్రమ నిర్బంధాల వ్యవహారంలో ఏపీ పోలీసుల తీరుపై హైకోర్టు మరోసారి తీవ్రంగా స్పందించింది. హెబియస్ కార్పస్ పిటిషన్లపై హైకోర్టులో వాదనలు జరిగాయి. డీజీపీని కోర్టుకు పిలిపించి.. రూల్ ఆఫ్ లా అమలయ్యేలా చూడాలని కోరితే...డీజీపీ అందుకు హామీ ఇచ్చారని కోర్టు తెలిపింది. కానీ మళ్లీ అలాంటి ఘటనలే పునరావృతమవుతున్నాయని ధర్మాసనం వ్యాఖ్యానించింది. రాష్ట్రంలో రాజ్యాంగం బ్రేక్ డౌన్ జరిగిందా? లేదా? అనే విషయాన్ని తదుపరి విచారణలో తేలుస్తామని కోర్టు స్పష్టం చేసింది. విచారణను ఈనెల 7వతేదీకి వాయిదా వేసింది.

అక్రమ నిర్బంధాలపై పోలీసులపై ఏపీ హైకోర్టు ఆగ్రహం
అక్రమ నిర్బంధాలపై పోలీసులపై ఏపీ హైకోర్టు ఆగ్రహం

హెబియస్ కార్పస్ పిటిషన్లపై విచారణ జరిపిన ఏపీ హైకోర్టు... పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. న్యాయవాదుల్నే బెదిరిస్తారా.. అని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పోలీసుల తీరు నిజంగా సిగ్గుచేటని ఘాటుగా వ్యాఖ్యానించింది. దేనికైనా ఓ హద్దు ఉంటుందని తెలిపింది. ఎవరూ ఆ హద్దును అతిక్రమించడానికి వీల్లేదని తేల్చి చెప్పింది.

' గతంలో మేము డీజీపీని కోర్టుకు పిలిపించి .. రూల్ ఆఫ్ లా అమలయ్యేలా చూడాలని విజ్ఞప్తి చేశాం. అందుకు డీజీపీ హామీ ఇచ్చారు. అయినా ఉపయోగం లేదు. మళ్లీ అవే ఘటనలు పునరావృతం అవుతున్నాయి. ఇలాగయితే రాష్ట్రం ఇబ్బందుల్లో పడుతుంది. ఆ విషయాన్ని మేము స్పష్టంచేస్తున్నాం ' అని ధర్మాసనం ఘాటుగా వ్యాఖ్యానించింది. రాష్ట్రంలో రాజ్యాంగం బ్రేక్ డౌన్ జరిగిందా? లేదా ? అనే విషయాన్ని తదుపరి విచారణలో తేలుస్తామని హెచ్చరించింది. విచారణను ఈనెల 7కు వాయిదా వేసింది.

హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ రాకేశ్ కుమార్, జస్టిస్ జె.ఉమాదేవితో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలిచ్చింది. పోలీసులు చట్ట ఉల్లంఘనలకు పాల్పడుతూ ఏపీ వ్యాప్తంగా పలువురి వ్యక్తుల్ని అక్రమంగా నిర్బంధంలోకి తీసుకున్న ఘటనల్లో వారిని కోర్టులో హాజరుపరిచేలా ఆదేశాలు జారీచేయాలని అభ్యర్థిస్తూ దాఖలైన హెబియస్ కార్పస్ పిటిషన్లపై హైకోర్టు మరోసారి విచారణ జరిపింది.

ఇక మీదట సహించం..

ప్రభుత్వ ప్రత్యేక కౌన్సిల్​గా ఇటీవల నియమితులైన సీనియర్ న్యాయవాది ఎస్.ఎస్. ప్రసాద్ విచారణకు హాజరయ్యారు. తాజాగా నియమితులయ్యానని దస్త్రాలను పరిశీలించి వాదనలు వినిపించేందుకు కొంత సమయం కావాలని కోరారు. ఇలాంటి వ్యాజ్యాల్లో ఎక్కువ సమయం ఇచ్చేది లేదని ధర్మాసనం తేల్చి చెప్పింది. ఇప్పటి వరకు జరిగిందేదో జరిగింది. ఇక మీదట సహించబోమని వ్యాఖ్యానించింది.

ఓ పిటిషనర్ తరపు న్యాయవాది రవితేజ వాదనలు ప్రారంభిస్తూ .. సహచర న్యాయవాది ఇంటిపై తెల్లవారుజామున పోలీసులు అక్రమంగా దాడి చేశారన్నారు. ఆ వివరాల్ని పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం.. ఏపీలో రాజ్యాంగం బ్రేక్ డౌన్ జరిగిందా ? లేదా ? అనే విషయాన్ని తదుపరి విచారణలో నమోదు చేస్తామని ఉత్తర్వుల్లో ప్రస్తావించింది. చట్టబద్ధపాలన రాష్ట్రంలో సక్రమంగా అమలయ్యేలా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వ న్యాయవాదులుగా మీపైనా ఉందని గుర్తుచేసింది.

ప్రసార మాధ్యమాలపైనే అభ్యంతం : ప్రత్యేక కౌన్సిల్ సీనియర్ న్యాయవాది

పోలీసులు నిబంధనలను ఉల్లంఘించడానికి వీల్లేదని ప్రత్యేక కౌన్సిల్ సీనియర్ న్యాయవాది ఎస్ఎస్ ప్రసాద్ వాదనలు వినిపించారు. పిటిషనర్లు సైతం తప్పుడు ఆరోపణలతో పిటిషన్లు వేయకూడదన్నారు. తమ అభ్యంతరం కోర్టు మీద కాదన్నారు. అభ్యంతరం అంతా ప్రెస్ మీదనే అన్నారు. విచారణ సందర్భంగా కోర్టు ఏది పరిశీలిస్తే దాన్ని విస్తృతంగా ప్రసారం చేస్తోందన్నారు.

ధర్మాసనం స్పందిస్తూ.. అబ్జర్వేషన్ గురించి మరిచిపోండి.. ఏ వ్యాజ్యంలోనైనా కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేస్తే అందులోని మొత్తం వివరాలతో పత్రికల్లో ప్రచురిస్తున్నారని వ్యాఖ్యానించింది. ప్రభుత్వ సీనియర్ న్యాయవాది మరోసారి స్పందిస్తూ.. 7న విచారణకు సిద్ధపడి వస్తానని కోర్టుకు హామీ ఇస్తున్నానన్నారు. కోర్టు ఉత్తర్వుల్లో ఇతర ఏ వివరాలు నమోదు చేయాల్సిన అవసరం లేదన్నారు.

ఉపసంహరణ అనుమతించం

ధర్మాసనం స్పందిస్తూ .. ఈ ఉత్తర్వులపై అభ్యంతరం ఉంటే సుప్రీంకోర్టును ఆశ్రయించాలని సూచించింది. మీ రాష్ట్రం చాలా ధనికమైంది. సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయవాదిని ఎవరినైనా నియమించుకోవచ్చని తెలిపింది. పిటిషనర్లు ఎవరైనా పోలీసులపై తప్పుడు వివరాలతో అఫిడవిట్ వేసినట్లయితే.. అలాంటి వ్యాజ్యాలను ఉపసంహరించుకోవడానికి అనుమతించమని ధర్మాసనం స్పష్టంచేసింది. తేలిగ్గా తీసుకొని పోలీసుల మీద ఆరోపణలతో వ్యాజ్యాలు దాఖలు చేయడం సరికాదని వ్యాఖ్యానించింది.

ఇదీ చూడండి: రాష్ట్రంలో మరో 2,009 మందికి కరోనా, 10 మంది మృతి

ABOUT THE AUTHOR

...view details