ఇతర రాష్ట్రాల నుంచి ఒంటెలను అక్రమంగా ఇక్కడికి తరలించి.. వాటి మాంసం విక్రయించడంపై వివరణ ఇవ్వాలంటూ కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఒంటెల అక్రమ రవాణా, మాంసం విక్రయాలపై సికింద్రాబాద్ తిరుమలగిరికి చెందిన డాక్టర్ కె.శశికళ ప్రజాప్రయోజన వ్యాజ్యంపై రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం గురువారం విచారణ చేపట్టింది.
రాజస్థాన్, గుజరాత్‌లతో పాటు పలు ఉత్తరాది రాష్ట్రాల నుంచి ఒంటెలను అక్రమంగా తరలిస్తున్నారని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదించారు. ఆయా రాష్ట్రాల నుంచి వేల కిలోమీటర్లు నడిపించి, వాహనాల్లో అమానవీయంగా తరలిస్తున్నారని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. అనంతరం క్రూరంగా వధించి మాంసం విక్రయిస్తున్నారన్నారు. బక్రీద్ సందర్భంగా నెలాఖరులో మరింత జంతు హింస జరిగే అవకాశం ఉందని న్యాయవాది దివ్య వాదించారు.