ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ... 'జాయిన్ ఫర్ డెవలప్‌మెంట్ ఫౌండేషన్ ఛైర్మన్, సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ దాఖలుచేసిన వ్యాజ్యంపై హైకోర్టులో విచారణ జరిగింది. పిటిషనర్ తరఫున వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది బి.ఆదినారాయణరావు... ఏపీ ప్రజల పోరాట ఫలితంగా విశాఖ ఉక్కు కర్మాగారం ఏర్పాటైందని గుర్తుచేశారు. ప్లాంట్ కోసం ప్రజలు తమ భూముల్ని, జీవితాల్ని త్యాగం చేశారన్నారు.
ప్రాథమిక హక్కుల ఉల్లంఘన
ఉక్కు పరిశ్రమకు 22 వేల ఎకరాలు సేకరించిన కేంద్ర ప్రభుత్వం... ఇప్పటివరకు పూర్తిస్థాయిలో పునరావాసం, ఉద్యోగ భద్రత కల్పించలేదని న్యాయవాది బి.ఆదినారాయణరావు వివరించారు. భూములు త్యాగం చేసిన వారికి జీవనోపాధి కల్పించకపోవడం ప్రాథమిక హక్కుల్ని ఉల్లంఘించడమేనన్నారు. భూసేకరణ సమయంలో ఉద్యోగాల హామీ ఇచ్చి, ఆ తర్వాత వెనక్కి తగ్గడానికి వీల్లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసిన విషయాన్ని ప్రస్తావించారు. కర్మాగారంపై ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధారపడ్డ లక్షల మందికి జీవనాధారం చూపకుండా ప్రైవేటీకరణ చేస్తే... వారి జీవితాలపై తీవ్ర ప్రభావం పడుతుందన్నారు.
ఏకపక్ష నిర్ణయం
విశాఖ ఉక్కును లాభాల బాట పట్టించడానికి ఉన్న ప్రత్యామ్నాయ మార్గాల్ని పరిశీలించకుండా... ప్రైవేటీకరణ నిర్ణయం తీసుకోవడం ఏకపక్షమని న్యాయవాది బి.ఆదినారాయణరావు వాదించారు. నష్టాల సాకుతో వంద శాతం పెట్టుబడులు ఉపసంహరణకు అనుమతిచ్చే చట్ట నిబంధనే లేదన్నారు. నష్టాల పేరుతో గతంలో హిందుస్థాన్ జింక్‌ను ప్రైవేటీకరిస్తే... ఆ సంస్థ యాజమాన్యం పరిశ్రమను మూసేసి స్థిరాస్తి వ్యాపారం చేసిందని గుర్తుచేశారు. పరిశ్రమల కోసం ప్రజలు భూములిచ్చారే తప్ప, రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం కాదన్నారు. ప్రభుత్వాలు ఇష్టానుసారం ఆర్థికపరమైన విధాన నిర్ణయాలు తీసుకోవడానికి వీల్లేదన్నారు. ఇలాంటి అంశాలపై న్యాయస్థానాలు పునఃసమీక్ష చేయాల్సిన సమయం ఆసన్నమైందని అభిప్రాయపడ్డారు.