తెలంగాణ

telangana

ETV Bharat / state

HC on Adopted Son Property : 'దత్తత వెళ్తే.. పుట్టిన కుటుంబం ఆస్తిలో ఎలాంటి హక్కులుండవు' - దత్తత పుత్రునికి ఆస్తి విషయంపై హైకోర్టు తీర్పు

High Court Judgment Of Adopted Son Property : దత్తత వెళ్లిన వ్యక్తికి పుట్టిన కుటుంబానికి చెందిన ఆస్తిలో హక్కులు ఉండవని హైకోర్టు తేల్చిచెప్పింది. ఒక వ్యక్తి రెండు కుటుంబాల్లో ఉండరని, అలాంటప్పుడు ఆస్తిలో హక్కు ఉండదని పేర్కొంది. దత్తతకు వెళ్లకముందు భాగ పరిష్కారం జరిగి వాటా కేటాయించినట్లయితే.. ఆ ఆస్తిపై మాత్రమే హక్కు ఉంటుందని తెలిపింది.

Telangana High Court Sensational Judgment
Telangana High Court Sensational Judgment

By

Published : Jul 4, 2023, 11:46 AM IST

Telangana High Court Judgment Of Adopted Son Property : వేరే కుటుంబంలోకి దత్తత వెళ్లిన వ్యక్తికి.. పుట్టిన కుటుంబానికి చెందిన ఆస్తిలో హక్కులు ఉండవని హైకోర్టు తాజాగా తీర్పును వెలువరించింది. దత్తత వెళ్లినప్పటికీ పుట్టిన కుటుంబంలో వాటా ఉంటుందని ఖమ్మం సివిల్‌ కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ.. ఎ.నాగేశ్వరరావు, కుటుంబ సభ్యులు హైకోర్టులో అప్పీలు చేశారు. దీనిపై న్యాయమూర్తులు జస్టిస్‌ పి.నవీన్‌రావు, జస్టిస్‌ బి.విజయ్‌సేన్‌రెడ్డి, జస్టిస్‌ నగేశ్‌ భీమపాకలతో కూడిన ఫుల్‌బెంచ్‌ సుదీర్ఘంగా విచారించి ఇటీవల ఈ తీర్పు వెలువరించింది.

ఒక వ్యక్తి రెండు కుటుంబాల్లో ఎలా ఉంటారని.. ఏదో ఒక కుటుంబంలో మాత్రమే ఉంటేనే ఆస్తి అనేది తన పేరు మీద ఇవ్వవచ్చని హైకోర్టు పేర్కొంది. అలాగే ఒక వ్యక్తి రెండు కుటుంబాల్లో ఉండరని.. అలాంటప్పుడు ఆస్తిలో హక్కులు కూడా ఉండకూడదని తెలిపింది. దత్తత వెళ్లినప్పటికీ.. జన్మించిన కుటుంబం ఆస్తిలో వాటా ఉంటుందంటూ ఖమ్మం జిల్లా కొణిజెర్ల మండలానికి చెందిన ఏవీఆర్‌ఎల్‌ నరసింహారావు ఖమ్మం సివిల్‌ కోర్టులో పిటిషన్‌ వేశారు. ఒకవేళ దత్తతకు ముందు భాగ పరిష్కారం జరిగి వాటా కేటాయించినట్లయితే.. కేవలం ఆ ఆస్తిపై మాత్రమే హక్కులు ఉంటాయని తేల్చి చెప్పింది.

పుట్టింటి ఆస్తి ఇవ్వవలసిన అవసరం లేదు : అయితే దత్తతకు వెళ్లకముందు ఎలాంటి కేటాయింపులు లేకపోతే జన్మించిన కుటుంబానికి చెందిన ఆస్తిలో.. చిల్లిగవ్వ వాటా కూడా ఉండదంటూ హైకోర్టు తన తీర్పుతో కుండబద్ధలు కొట్టింది. ఒకసారి దత్తతకు వెళ్లినప్పుడు పుట్టిన కుటుంబంతో ఉన్న సంబంధాలు అన్నింటినీ తెంచుకొని వెళతారని పేర్కొంది. అలాంటప్పుడు ఎందుకు ఆస్తి ఇవ్వాలని.. దత్తత తీసుకున్న కొత్త కుటుంబ బంధాలను పొందుతారని చట్టం చెబుతోందని హైకోర్టు తెలిపింది. పుట్టిన కుటుంబంతో ఎలాంటి సంబంధం లేనప్పుడు ఆస్తిలో హక్కు పొందరని ధర్మాసనం పేర్కొంది.

Telangana High Court Key Judgment : ఈ కేసుకు సంబంధించి పూర్వ కేసులలో ఇచ్చిన తీర్పులను హైకోర్టు గుర్తు చేసింది. కోల్‌కతాలోని దాయాభాగ, తెలుగు రాష్ట్రాల్లో మితాక్షర చట్టం ప్రకారం.. పుట్టిన వెంటనే ఉమ్మడి కుటుంబం ఆస్తిలో హక్కు పొందుతాడన్నప్పటికీ ప్రత్యేకంగా అందుకు హక్కు పేర్కొనలేదని హైకోర్టు చెప్పింది. దీని ప్రకారం పూర్వీకుల ఆస్తిలో భాగం ఉంటుందని.. అయితే పుట్టిన కుటుంబంలోని వారు సంపాదించిన ఆస్తిలో వాటా ఉండదని తేల్చి చెప్పింది. అలాగే యార్లగడ్డ నాయుడమ్మ కేసులో ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పు చట్ట ప్రకారం సరికాదని పేర్కొంది. మేన్స్‌ హిందూ చట్టం, ముల్లా సూత్రాలతో పాటు పట్నా, అలహాబాద్‌ హైకోర్టులు, సుప్రీంకోర్టు తీర్పులను పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది. అందులో దత్తతకు ముందు వాటా కేటాయించకపోతే పుట్టిన కుటుంబ ఆస్తిలో హక్కు ఉండదంటూ 44 పేజీల తీర్పును తెలంగాణ హైకోర్టు వెలువరించింది.

ఇవీ చదవండి :

ABOUT THE AUTHOR

...view details