సచివాలయం కూల్చివేత వివాదంపై రేపు హైకోర్టు తీర్పు వెల్లడించనుంది. ప్రస్తుత సచివాలయాన్ని కూల్చేసి అదే స్థానంలో నూతనంగా నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ కాంగ్రెస్ నేతలు రేవంత్ రెడ్డి, జీవన్ రెడ్డితోపాటు.. తెజస నాయకుడు పీఎల్ విశ్వేశ్వరరావు తదితరులు హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేశారు.
సచివాలయం కూల్చివేత వివాదంపై రేపే హైకోర్టు తీర్పు - new Secretariat construction news in telugu
సచివాలయం కూల్చివేతపై నెలకొన్న వివాదాలపై జరుగుతున్న సుదీర్ఘ వాదనలకు హైకోర్టు రేపు తెరవేయనుంది. ప్రస్తుత సచివాలయాన్ని కూల్చివేసి... నూతన భవనాన్ని నిర్మించాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని హైకోర్టు సమర్థిస్తోందా...? ప్రజాధనం వృథా అవుతోందని ప్రతిపక్ష నాయకుల వాదనను సమర్థిస్తోందా...? అనేది రేపు వెల్లడించనుంది.
కొన్నిరోజుల పాటు సుదీర్ఘంగా వాదనలు విన్న ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, జస్టిస్ అభిషేక్ రెడ్డి ధర్మాసనం మార్చి 10న తీర్పును రిజర్వ్ చేసింది. ప్రస్తుత సచివాలయం పార్కింగ్, సమావేశాలు, ఇతర అవసరాలకు సరిపోవడం లేదని ప్రభుత్వం వాదించింది. అగ్నిప్రమాదాలు పొంచి ఉన్నాయని నిపుణుల కమిటీ తెలిపిందని వివరించింది. ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాల్లో న్యాయస్థానాలు జోక్యం చేసుకోవద్దని వాదించింది.
ప్రజాధనం దుర్వినియోగం అవుతున్నప్పుడు న్యాయస్థానాలు జోక్యం చేసుకోవచ్చని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాదించారు. ఉమ్మడి రాష్ట్రంలో అవసరాలకు సరిపోయిన సచివాలయం ఇప్పుడు సరిపోవడం లేదన్న వాదన అసమంజసం అన్నారు. ఇరువైపులా వాదనలు ఇప్పటికే విన్న హైకోర్టు.. రేపు తీర్పు వెల్లడించనుంది.