Justice AV Seshasai speech at Telugu Conferenc : తెలుగు ప్రజల పెద్ద పండుగైన సంక్రాంతికి ఘనమైన ఆహ్వానం పలికేలా ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ వేదికగా ప్రపంచ తెలుగు రచయితల ఐదో మహాసభలను ఘనంగా నిర్వహించారు. రెండు రోజుల పాటు జరిగిన ఈ వేడుకలు శనివారం ముగిశాయి. పాత తరం ఘనతలను గుర్తుచేస్తూ.. వర్తమానంలోని పరిస్థితులను ఉటంకిస్తూ.. భవిష్యత్తుకు భరోసా కల్పించాల్సిన కర్తవ్యాన్ని నిర్దేశిస్తూ.. ఈ మహాసభలు వివిధ అంశాలపై కూలంకుషంగా చర్చించాయి.
అమృతం లాంటి తెలుగుభాషని మృత భాష కానీయరాదని.. తెలుగు రాష్ట్రాలతో పాటు రాష్ట్రేతర ప్రాంతాలు, వివిధ దేశాల నుంచి వచ్చిన సాహితీవేత్తలు, భాషాభిమానులు, రచయితలు.. తమ ధృఢ సంకల్పాన్ని వ్యక్తం చేశారు. మాతృభాషపై అభిమానంతో భాషా సంస్కృతుల పరిరక్షకులుగా.. తెలుగువారంతా తెలుగుభాషను వర్ధిల్లేలా చేయాలని విజ్ఞప్తి చేశారు. శతక పద్యాలు, సూక్తులు, జాతీయాలు, సామెతలు వంటివాటిని పిల్లలకు నేర్పించి.. వారిని తెలుగులో ఎదగనివ్వాలని తల్లిదండ్రులను అభ్యర్థించారు.
తమిళులు, కన్నడిగులతో పోలిస్తే తెలుగువారిలో భాషాభిమానం తక్కువేనని.. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎ.వి.శేషసాయి అన్నారు. రెండో రోజు మహాసభలకు ముఖ్య అతిథిగా ఆయన హాజరయ్యారు. మాతృభాష పరిరక్షణలో తల్లులు ముఖ్యభూమిక పోషించాలని పిలుపునిచ్చారు. భాషను అలక్ష్యం చేస్తే ఆ జాతి మనుగడే ప్రశ్నార్థకమవుతుందన్నారు.. పాలమీగడ, జున్ను లాంటి తెలుగుభాష పాశ్చాత్య ఇంగ్లీషు ప్రవాహంలో నలిగిపోతోందని ప్రజాకవి అందెశ్రీ మదనపడ్డారు.