సాదాబైనామాల పేరిట తెల్లకాగితాలపై క్రయవిక్రయాలు జరిపిన భూములను క్రమబద్ధీకరించాలన్న ప్రభుత్వ నిర్ణయం పట్ల హైకోర్టు తాజా ఉత్తర్వులతో అధికారయంత్రాంగం మల్లగుల్లాలు పడుతోంది. అక్టోబరు 29 వరకు వచ్చిన దరఖాస్తులను మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు నిర్దేశిత గడువు నాటికి ఎంతమంది దరఖాస్తులు చేసుకున్నారో లెక్కలు తేల్చే పనిలో అధికార యంత్రాంగం నిమగ్నమైంది.
భూముల క్రయవిక్రయ లావాదేవీలకు పూర్తి హక్కును కల్పించేలా ప్రభుత్వం సాదాబైనామాల క్రమబద్ధీకరణకు 2017లో ముందుకొచ్చింది. రాష్ట్రం ఏర్పడక ముందు జరిగిన లావాదేవీలను ఈ కార్యక్రమం కింద దరఖాస్తు చేసుకోవాలని అవకాశం కల్పించింది. తొలిసారిగా 4,759 మంది దరఖాస్తులు చేసుకోగా.. 2,116 మందిని అర్హులుగా తేల్చి 1,590 మందికి పట్టాలు జారీ చేశారు. రెవెన్యూ సంస్కరణల నేపథ్యంలో ప్రభుత్వం మళ్లీ దరఖాస్తులకు అవకాశమిస్తూ కిందటి నెల 31వ తేదీ వరకు గడువు విధించింది. ఆ గడువును ఈ నెల 10వ తేదీ వరకు పొడిగించింది. ధరణి సేవల అమలు దృష్ట్యా ప్రభుత్వం కొత్త చట్టం రూపొందించింది.
అయోమయంలో దరఖాస్తుదారులు
ఇదివరకు ఉన్న చట్టం రద్దయ్యాక క్రమబద్ధీకరణ ప్రక్రియను ఎలా కొనసాగిస్తారంటూ నిర్మల్ జిల్లా వాసి హైకోర్టులో ప్రజాహితవ్యాజ్యం దాఖలు చేశారు. విచారణ చేసిన హైకోర్టు సాదాబైనామాల క్రమబద్ధీకరణకు సంబంధించి భూ యాజమాన్య హక్కుల కల్పన చట్టం రద్దయిన అక్టోబరు 29 వరకు వచ్చిన దరఖాస్తులకు మాత్రమే అనుమతి ఇచ్చింది. దీంతో నిర్ణీత గడువుకు ముందు.. తర్వాత వచ్చిన దరఖాస్తులు ఎన్నో తెలుసుకునే ప్రక్రియ మొదలుపెట్టారు. దీంతో గడువు తర్వాత దరఖాస్తు చేసుకున్న వారిలో అయోమయం నెలకొంది. గడువులోగా దరఖాస్తు చేసుకున్నవారిలోనూ తాజా చర్యలు సందిగ్ధతకు దారితీస్తోంది.
తదుపరి ఆదేశాల మేరకు చర్యలు
జిల్లాలో సాదాబైనామా దరఖాస్తుల క్రమబద్ధీకరణకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇంకా ఎలాంటి ఉత్తర్వులు రాలేదు. కోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో గత నెల 29 వరకు ఎన్ని దరఖాస్తులు వచ్చాయో తెలుసుకోవాల్సి ఉంది. గతంలో అపరిష్కృతంగా ఉన్న దరఖాస్తుదారులతో పాటు కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారి వివరాలు తహసీల్దారు కార్యాలయాల నుంచి తెప్పించి తదుపరి ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామని ఆదిలాబాద్ ఉట్నూరు ఆర్డీవో రాజేశ్వర్ వివరించారు.
ఇదీ చదవండి:నేడు కొత్త ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం